తెలంగాణ అభివృద్ధి మంత్రంగా బిఆర్ఎస్ పని చేస్తుంది

నా కుటుంబమే ప్రజాసేవకు అంకితం
ముద్ర, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి మంత్రంతో బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని శంభునపల్లి, తనుగుల, విలాసాగర్, గండ్రపల్లి గ్రామాలతో పాటు జమ్మికుంట మున్సిపాలిటీలోని 16, 22, 29 వార్డులలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు.తెలంగాణలో అమలుపరిచిన సంక్షేమ పథకాలతో ఎన్నో పేద కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండిందన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడంతోపాటు, 19వేల కోట్లతో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నాడు. ఇప్పుడు కూడా పేదోళ్ల కు ఏ బాధ ఉండకూడదని కొత్త మేనిఫెస్టోని తయారు చేశారని అన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకంతో అర్హులైన మహిళలందరికీ నెలకు 3000 చొప్పున ఇవ్వనున్నామని, గ్యాస్ సిలిండర్ను కూడా 400కే ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచనున్నామని, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కెసిఆర్ ధీమా ఇంటింటా బీమా అనే పథకం ద్వారా ఎవరైనా కుటుంబ పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి 5 ల్లక్షలు భీమ మొత్తాన్ని అందజేస్తామన్నారు.
మొన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అభివృద్ధి నా బాధ్యత అని అన్న మాట గుర్తు చేశారు. గత రెండేళ్లుగా జమ్మికుంట లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసుకుందామని, హుజురాబాద్ లో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి బై కోట్లు తీసుకువచ్చి హుజరాబాద్ సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని అన్నారు. నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకె రాజకీయంలోకి వచ్చానని, నాతోపాటు నా కుటుంబ సభ్యులంతా ప్రజాసేవకే అంకితం అన్నారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం ఏం చేస్తాడో చెప్పడం మరిచి నా కుటుంబం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నేను నా కుటుంబం ప్రజల కోసం ప్రజా సేవ కోసమే ఉంటామన్నారు. ఓటరుకు దండం పెడుతున్నారని ఓటర్ని కించపరిచేలా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
నాకు ఓటరు దేవుడితో సమానం అందుకనే దండం పెట్టి అడిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈసారి హుజురాబాద్ నియోజకవర్గం పై గులాబీ జెండా ఎగరడం తద్యమన్నారు. నియోజకవర్గ ప్రజలంతా అభివృద్ధి కాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మిగిలిపోయిన, రోడ్లు కాలువలు, కుల సంఘాల భవనాలతో పాటు అన్ని రకాలుగాఅభివృద్ధి చేస్తానని అన్నారు. దీంతోపాటు గృహలక్ష్మి, బిసి లోన్లకు దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ ఎన్నికల అనంతరం ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో పాటు బీసీ లోన్ చెక్కులు కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్ తొక్కలపల్లి రాజేశ్వరరావు, పింగిలి రమేష్, దేశిని కోటి, నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.