ఆయన అక్కినేనికీ పాడారు, అల్లు రామలింగయ్యకూ పాడారు

ఆయన అక్కినేనికీ పాడారు, అల్లు రామలింగయ్యకూ పాడారు

గాయకులు ఎందరో ఉంటారు. ఒక్కొక్కరి గొంతు ఒక్కో తరహా పాటలకు చక్కగా సరిపోతుంది. కొందరు భక్తి పాటలు, మరికొందరు లలితగీతాలూ, ఇంకొందరు హాస్యపరమైనవీ పాడతారు. అలాగే సినిమాలకు పాడేవారు సాధారణంగా ఎవరో ఒక హీరోకే పాడతారు. తెరమీద నిజంగా ఆ హీరోనే పాడుతున్నారా అనిపిస్తుంది వినేవాళ్లకు. కానీ మరికొందరు అలా కాదు… ఎవరికైనా పాడే ప్రావీణ్యం వారి సొంతం. అలాంటి అద్భుతమైన గాయకుడు బాలు… శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తెలుగులో రెండు తరాలపాటు అగ్రహీరోలందరికీ పాడారు. ఒక హీరో   మాట్లాడేటప్పుడు గొంతు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ హీరో పాడేటప్పుడు గొంతు ఎలా ఉంటుందో గ్రహించి పాడారు బాలు. అదే ఎస్పీ స్పెషాలిటీ.  ఒక్క తెలుగులోనే కాదు … అనేక భారతీయ భాషల్లో నటులకూ పాడారు. ఇంకో ముఖ్యమైన సంగతేమిటంటే …  హీరోలకే కాదు బాలు కమేడియన్లకూ పాడారు. అక్కినేనికీ పాడారు. అల్లు రామలింగయ్యకూ పాడారు. 

హీరోలకు పాడేటప్పుడు గొంతు సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది. కానీ హాస్యనటులకు పాడడం అంత తేలిక కాదు. వారి గొంతుకు తగ్గట్టు పాడడమే కాకుండా, హాస్యాన్ని పలికించాలి. పాత తరంలో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం ఆనాటి హాస్యనటులకు పాడేవారు. హాస్యగీతాలతోనే చాలా ప్రసిద్ధి చెందారు. వాళ్ల గొంతు పద్మనాభం, రమణారెడ్డి, రేలంగి వంటి హాస్యనటులకు బాగా సరిపోయేది. వారు హీరోలకు పాడలేదు. బాలు మాత్రం హీరోలకు పాడుతూనే హాస్యనటులకూ పాడారు. అది ఆయన మరో ప్రత్యేకత. ఎవరికి ఏవిధంగా పాడాలో బాలూకు బాగా తెలుసు. అందువల్లే ఎందరికో తన గొంతునిచ్చారు. అలాంటి వైవిధ్యమైన గొంతు ఆయనకు దేవుడిచ్చిన వరం.

గాయనీగాయకులు ఎక్కువ కాలం నిలిచి వెలగాలంటే గొంతును కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1966లో హాస్యనటుడు పద్మనాభం తీసిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన బాలు 50 ఏళ్లపాటు పాడారు. ఇంత ఎక్కువ కాలం పాడడమంటే మాటలు కాదు. కొందరికి వయసు పైబడే కొద్దీ స్వరంలో కొంత మార్పు రావడం సహజం. కానీ బాలసుబ్రహ్మణ్యం గొంతు మాత్రం మారలేదు. ఇక్కడొక విషయం చెప్పాలి. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన స్వరం తేలికగా ఉండేది. కాస్త పీలగా కూడా ఉండేది. అంటే గంభీరంగా ఉండేది కాదు. తర్వాత ఎంతో సాధన చేసి తన గొంతును గంభీరంగా పాడేందుకు తగ్గట్టుగా మలుచుకున్నారు.

ఎన్నో భాషల్లో 40 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం అంత వినయంగానూ ఉండేవారు. 2011లో ఒకసారి ఏమన్నారంటే ‘నేను 45 సంవత్సరాల నుంచీ పాడుతున్నా. ఎవరికి ఎప్పుడు యోగం వస్తుందో చెప్పడం కష్టం. చాలామంది గాయనీ గాయకుల్లో అప్పుడూ ఇప్పుడూ కూడా విద్వత్తూ, కృషి ఉన్నాయి. నాకంటే ఎక్కువ తెలిసిన వారూ, టాలెంట్ ఉన్నవారూ ఉన్నారు.  యోగ్యత ఒక్కటే ఉంటే సరిపోదు. యోగం కూడా ఉండాలి’ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడు మాత్రమే కాదు. నటుడు, సంగీత దర్శకుడు, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాతగా కూడా తనను నిరూపించుకున్నారు. అంతటి బహుముఖ ప్రతిభాశాలి బాలు 2020 సెప్టెంబర్ 25న కరోనావల్ల మరణించడం మనందరి దురదృష్టం.

(బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం)

– వి. మధుసూదనరావు.