Balka Suman: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బాల్క సుమన్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కెదురు
- చెన్నూర్ నియోజకవర్గంలో బాగా వెనుకబడిపోయిన బాల్క సుమన్
- 12 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి భారీ ఆధిక్యం పొందడంతో బాల్క సుమన్ ఇక పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు. కౌంటింగ్ ఆరంభం నుంచి వివేక్ దూకుడు ప్రదర్శించారు. ఐదు రౌండ్ల అనంతరం ఆయన ఆధిక్యం 12 వేలకు పైనే ఉంది. వివేక్ కు 26,122 ఓట్లు లభించగా, బాల్క సుమన్ కు 14,083 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన మూడో స్థానంలో కొనసాగుతున్నారు.