తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం
- పాతబస్తీలోనూ హిందువులంతా ఏకమయ్యారు
- దేశానికి దిశ దశ చూపేది నరేంద్రమోదీ మాత్రమే
- బీజేపీలో చేరే వారికే రాజకీయ భవిష్యత్తు
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను సాధించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని చెప్పారు. మంగళవారం కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం జాగీరని భావించారు. కానీ పాతబస్తీలోనూ హిందువులంతా ఓటుబ్యాంకుగా మారబోతున్నరు. హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నం.అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించింది. బీజేపీకి సంబంధం లేదు. భక్తులు అయోధ్య వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే రైలు ప్రయాణంసహా అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తూ భక్తులను ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ నుండి రైళ్లను ప్రత్యేకంగా వేసింది.
గావ్ ఛలో అభియాన్ లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి పల్లె నిద్ర చేయాలి. నగరాల్లో బస్తీ నిద్ర చేయాలి. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలి. చారిత్రాక కట్టడాలుంటే సందర్శించాలి అన్నారు. కొత్త ఓటర్లుంటే వారితో మమేమకం కావాలి. అందులో భాగంగా హుజూరాబాద్ లోని రంగాపూర్ గ్రామంలో రాత్రి బస చేయబోతున్నట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి మనుగడ చూసుకుంటుంది. కానీ ప్రజలు మాత్రం బీజేపీనే ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశానికి దశ దిశ చూపబోయే నాయకుడు నరేంద్రమోదీ మాత్రమేనని విశ్వసిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమం అన్నారు. కార్పొరేటర్లు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.