ముఖ్యమంత్రి కి బండి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కి బండి బహిరంగ లేఖ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల చేనేతకా ర్మికులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని,ఆ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

 ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్‌ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్‌ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్‌ పెట్టి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 సిరిసిల్ల చేనేత సంక్షోభానికి ప్రధాన కారణం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలేనని ఎండగట్టారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల బకాయిల సొమ్ము 220 కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు.

కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే ముఖ్యమంత్రి హోదాలో భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని సూచించారు.

వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి నిధులు మంజూరు చేసి సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని అన్నారు.

సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళతానని ఆలేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.