సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయకేతనం

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయకేతనం
  • అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికల కౌంటింగ్‌‌ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జీ
  • పోలీసుల తీరుపై నిరసన చేసిన కాంగ్రెస్‌‌ నేతలు

ముద్ర, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌ ప్యానల్‌‌ విజయకేతనం ఎగురవేసింది. రాజకీయ పార్టీలతకు అతీతంగా ఈ ఎన్నికలు జరిగినప్పటికి ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అర్బన్‌‌ బ్యాంకు 12 డైరక్టర్‌‌ స్థానాలకు గాను 8 మంది బీఆర్ఎస్‌‌ బలపరిచిన అభ్యర్థులు ఇద్దరు ఇండిపెండెంట్, ఒకరు బీజేపి, ఒకరు కాంగ్రెస్‌‌ అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. సిరిసిల్ల అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికలు కాంగ్రెస్‌‌ వర్సెస్‌‌ బీఆర్ఎస్‌‌ గా మారాయి. కానీ కాంగ్రెస్‌‌ పార్టీ ప్యానల్లో.. కేవలం ఒక్కరే విజయం సాధించారు. కాంగ్రెస్‌‌ సిరిసిల్ల పట్టణధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్‌‌ తనయుడు ప్రమోద్‌‌ విజయం సాధించారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విజేతలు వీరే....

1. రాపెళ్లి లక్ష్మీనారాయణ 
2. గుడ్ల సత్యానంద్ (స్వంతంత్ర)
3. చొప్పదండి ప్రమోద్ (కాంగ్రెస్‌‌) 
4. అడగట్ల మురళి 
5 పాటీ కుమార్ రాజ్ 
6. బుర్ర రాజు 
7. వేముల సుక్కమ్మ 
8. అడ్డగట్ల దేవదాస్
9. ఏనగందుల శంకర్ 
10. వలస హరిణి (స్వతంత్ర) 
11. పత్తిపాక సురేష్( బీజేపీ)
12. కోడం సంజీవ్ (బీఆర్ఎస్‌‌) విజయం సాధించారు.

కౌంటింగ్‌‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జీ
సిరిసిల్ల అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికల కౌంటింగ్‌‌ హాల్‌‌ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్‌‌కు 8 డైరక్టర్‌‌ సీట్లు రాగా.. బీజేపికి, కాంగ్రెస్‌‌, స్వతంత్ర అభ్యర్థులు కలిసి నాలుగు సీట్లు వచ్చాయి. బీజేపి ప్యానల్‌‌ అభ్యర్థి పత్తిపాక సురేష్‌‌ అర్బన్‌‌ బ్యాంక్ చైర్మన్‌‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. బీఆర్ఎస్‌‌ నాయకులు తమ డైరక్టర్ల ను కారులో తరలిస్తున్న క్రమంలో తొపులాట జరిగింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జీ చేశారు. చెదరగొట్టారు. దీంతో కాంగ్రెస్‌‌ సిరిసిల్ల పట్టణధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్‌‌ పాటు రాష్ట్ర నాయకుడు సంగీతం శ్రీనివాస్‌‌ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. లాఠీచార్జీ పై పోలీసులతో వాగ్వివాదం చేశారు. దీంతో పోలీసు అధికారులు సముధాయించి ఇరువర్గాలను పంపించారు.


పోలీసుల తీరుపై విమర్శలు..
సిరిసిల్ల పోలీసులు ఎప్పుడు శాంతిభద్రతల విషయంలో.. చాకచక్యంగా వ్యవహిరిస్తారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. పార్లమెంట్‌‌ ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించారు. కాని సిరిసిల్ల పట్టణంలో జరిగే ఈ చిన్న అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికలో లాఠీచార్జీ వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్‌‌ నాయకులతో పాటు కాంగ్రెస్‌‌ నాయకులపై కూడా లాఠీలు జుళిపించడంతో.. అందరు అవాక్కయ్యారు. ఈ లాఠీచార్జీపై కాంగ్రెస్‌‌ సిరిసిల్ల పట్టణధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్‌‌, రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్‌‌ తో పాటు పలువురు కాంగ్రెస్‌‌ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ వారిపై లాఠీచార్జీ ఎందుకు చేశారంటూ కాంగ్రెస్‌‌ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంచలనం అయ్యింది.  సిరిసిల్ల పోలీసులు పెద్ద పెద్ద సవాళ్లను స్పూత్‌‌గా వ్యవహరించి శాంతియుతంగా సద్దుమనిగించారు.

వివిధ కార్యక్రమాలతో సిరిసిల్ల పోలీస్‌‌ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. కానీ అర్బన్‌‌ బ్యాంకు ఎన్నికల కౌంటింగ్‌‌ కేంద్రం వద్ద పోలీసు అధికారుల ఆదేశాలే అనువుగా తీసుకోని డిస్టిక్‌‌ గార్డ్‌‌ పోలీసులు విచక్షనరహితంగా లాఠీలు జుళిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ అందుబాటులో ఉంటే ఈ లాఠీచార్జీ జరగకపోవునని.. పలువురు పేర్కొంటున్నారు. సిరిసిల్ల లాఠీచార్జీ సంఘటనను బీఆర్ఎస్‌‌ శ్రేణులు బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ దృష్టికి తీసుకెళ్లారు.

బీజేపి, కాంగ్రెస్‌‌ నాయకులే ఈ లాఠీచార్జీ చేయించారని బీఆర్ఎస్‌‌ పేర్కొంటుండగా.. కాంగ్రెస్‌‌ నాయకులు కూడా ఈ లాఠీచార్జీలో బాధితులుగా ఉండటం విశేషం. ఈ విషయంపై ‘ముద్ర’ జిల్లా ఎస్పీ అఖిల్‌‌ మహాజన్ ను వివరణ కోరగా తాను హైదరాబాద్‌‌ మీటింగ్‌‌ లో ఉన్నానని, జరిగిన సంఘటనపై విచారణ జరుపుతానని పేర్కొన్నారు.