పోలీసు దిగ్బంధం లో బాసర ట్రిపుల్ ఐటి ... ఎబివిపి ముట్టడి పిలుపు ప్రభావం
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి తో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నీ పోలీసు దిబ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా పోలీస్ పహారా కనిపిస్తోంది. ఇటీవల బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్న ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏబీవీపీ శాఖ త్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాట్లను చేపట్టింది.
వివిధ ప్రాంతాల నుంచి బాసరకు రానున్న ఏబీవీపీ కార్యకర్తలను చేరుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి. వివిధ ప్రాంతాల నుంచి బాసరకు చేరుకున్న యువతను ప్రశ్నలతో విసిగించి సంతృప్తి చెందాకే బయటకు అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల కళ్ళు కప్పి బాసర త్రిపుల్ ఐటీ చేరుకుని గోడ పైనుండి లోపలికి దూకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ ప్రాంతాల ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.