ఎల్‌కె అద్వానీకి భారతరత్న

ఎల్‌కె అద్వానీకి భారతరత్న

స్వయంగా ఫోన్‌ చేసి తెలిపిన ప్రధాని మోదీ
ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞుడు..అరుదైన ముద్ర
అయోధ్య రథయాత్రతో రాజకీయాలను మలుపు తిప్పిన సారథి
అద్వానీ దేశ సేవలను స్మరించిన ప్రధాని

న్యూదిల్లీ, ఫిబ్రవరి 3 : రాజకీయ కురువృద్ధుడు, భాజపా  అగ్రనేత ఎల్‌కె అద్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడిరచారు. వాజ్‌పేయి తరవాత భారతరత్న అందుకున్న నేతగా అద్వానీ గౌరవం దక్కించుకున్నారు. దేశాభివృద్ధిలో అద్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. అడ్వాణీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నామని, ఆయనతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్న ప్రారంభించి..ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంటర్‌లో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయం. అడ్వాణీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా’ అని ప్రధాని రాసుకొచ్చారు. ‘దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.
అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్‌లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయ మైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి‘ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎల్‌కే అద్వానీతో ఉన్న రెండు ఫొటోలను ప్రధాని షేర్‌ చేశారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పారదర్శకత, సమగ్రతతో సేవలు అందించారని కొనియాడారు. తిరుగులేని నిబద్ధత, రాజకీయ నైతికతలతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పారని ప్రధాని మోదీ ప్రశంసించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో మాట్లాడి, ఆయ నుంచి పాఠాలు నేర్చుకోవడానికి తనకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం ఎల్లప్పుడు గొప్ప అదృష్టంగా భావిస్తానని మోదీ చెప్పారు. ఇకపోతే ఎల్‌కే అద్వానీ బీజేపీకి అత్యధికకాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక అటల్‌ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వొచ్చిన 90వ దశకంలో బీజేపీ ఎదుగుదల కోసం ఎల్‌కే అద్వానీ విశేష కృషి చేశారు. 2002-04 వరకు అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు. అద్వాణీ పూర్తి పేరు లాల్‌ కృష్ణ అడ్వాణీ. 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ లో జన్మించారు. అక్కడే సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో గల డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్యను పూర్తి చేశారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
దేశ విభజన తర్వాత భారత్‌కు వలస వొచ్చిన అద్వాణీ.. రాజస్థాన్‌లో సంఫ్‌ు ప్రచారక్‌గా పనిచేశారు. 1957లో దిల్లీకి వెళ్లి జన్‌సంఫ్‌ు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో దిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఫ్‌ు దిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్‌ అనే పత్రికలో నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా పనిచేశారు. 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980లో అద్వాణీ సహా కొంతమంది జన సంఫ్‌ును వీడారు. ఆ తర్వాత వాజ్‌పేయీతో కలిసి 1980 ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి భాజపా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అద్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓటమిపాలవ్వడంతో అద్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీ నగర్‌ నుంచి గెలుపొందిన అద్వాణీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అద్వానీకి భారతరత్న ప్రకటనతో బిజెపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.

నిస్వార్థ సేవ..అంకితభావం..
నన్ను భారతరత్నకు చేరువ చేశాయి
పురస్కార ప్రకటనపై అద్వానీ మనోగతం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : తనను ‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ స్పందించారు. అత్యంత వినమ్రత, కృతజ్ఞతతో ప్రదానం చేసిన ‘భారతరత్న’ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు. ఇది ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం శక్తి మేరకు సేవ చేయడానికి తాను అవలంబించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘నేను 14 సంవత్సరాల వయస్సులో రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఫ్‌ులో వాలంటీర్‌గా చేరిన నాటి నుంచి జీవితంలో నాకు అప్పగించిన ప్రతి పనినీ నాకు ఇష్టమైన దేశం కోసం అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేశాను.
‘ఇదం న మమ్‌’ (ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసం) నా జీవితాన్ని ప్రేరేపించింది‘. భారత రత్న దక్కిన సందర్భంగా తాను సన్నిహితంగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు- పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పేయిలను ఈ సందర్భంగా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నానని ఆద్వానీ తెలిపారు. ప్రజాజీవితంలో, తన ప్రయాణంలో కలిసి పనిచేసిన లక్షలాది మంది తన పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు ఆయన తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తన కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా తన ప్రియమైన భార్య కమలకు ధన్యవాదాలు తెలిపారు. వీరంతా జీవితంలో తనకు అండదండగా నిలిచారని తెలిపారు. తనకు ఈ పురస్కారాన్ని అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మన దేశం గొప్పతనం కీర్తి శిఖరాగ్రానికి పురోగమిస్తుందంటూ ఎల్‌కే అద్వానీ  ప్రకటన విడుదల చేశారు.