బోడుప్పల్ బంగారు మైసమ్మకు ఘనంగా బోనాలు
- అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: వజ్రేష్ యాదవ్
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయం చెంతనే వున్న బంగారు మైసమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. గ్రామ దేవతల అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, అందరినీ ఆ తల్లి కరుణాకటాక్షాలు ప్రసాదించాలని మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి, తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఆయన తన కుమారుడు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఇతర సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామదేవతలకు భారీ ఎత్తున పూజలు నిర్వహించడమన్నది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. తమకు ఎల్లవేళలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అమ్మవారు తమ కుటుంబాలకు తోడుగా ఉంటారనే నమ్మకంతో ప్రజానీకం ఏటా ఆ తల్లికి బోనాలు సమర్పిస్తారని అన్నారు.
అంతకుముందు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేకమంది తమ మొక్కుబడులు అమ్మవారికి సమర్పించారు. బంగారు మైసమ్మ ఆలయం శనివారం రాత్రి నుంచే విద్యుద్దీపాలంకరణలతో ధగధగద్దాయమానంగా వెలుగులీనుతోంది. పెద్దస్థాయిలో బంతిపూలతో అలంకరించడంతో ఆలయం నిజంగా బంగారు కాంతులీనింది. అమ్మవారు ప్రసన్నవదనంలో భక్తులను అనుగ్రహించింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి వజ్రేష్ యాదవ్, మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్ గౌడ్, బోడుప్పల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.