రాహూల్ గాంధీ పై బహిష్కరణ వేటు అప్రజాస్వామ్యం భట్టి విక్రమార్క

రాహూల్ గాంధీ పై బహిష్కరణ వేటు అప్రజాస్వామ్యం   భట్టి విక్రమార్క
ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రాహూల్ గాంధీ పై రెండేళ్లు బహిష్కరణ వేటు వేయడం ప్రజాస్వామ్యం పై దాడిగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం తొమ్మిదవ రోజు పాదయాత్ర ఆసిఫాబాద్ మండలం లోని వాడిగూడ గ్రామంలో భట్టి మాట్లాడారు. రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయించి సూరత్ కోర్టులో శిక్ష వేయడం దారుణమని అన్నారు. శిక్షను ఆసరాగా చేసుకుని పార్లమెంట్ నుంచి రెండేళ్లు అనర్హత వేటు వేశారని ఆయన మండిపడ్డారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేయడంతో మోదీ, అమిషా కు వెన్నులో వణుకుపుట్టిందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం కుట్రలకు రాహుల్ గాంధీ జడవరని ఆయన హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలో రాహుల్ గాంధీ పుట్టారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ పై బహిష్కరణ వేటు తో కాంగ్రెస్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బహిష్కరణ వేటు వేయడాన్ని ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలని భట్టి విక్రమార్క కోరారు.