దసరాకు ముహూర్తం...

దసరాకు ముహూర్తం...
  • 12న మంత్రివర్గ విస్తరణకు అవకాశం
  • ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్​ ఖర్గేకు సీఎం పరామర్శ
  • కేసీ తో భేటీ.. మంత్రి పదవులపై చర్చ.?

ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్​ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చకు దారితీసింది. ఎలాంటి షెడ్యూల్​ లేకుండానే అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అదివారం అస్వస్థతకు గురవడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నా.. అసలు కారణం మరొలా ఉందనే ప్రచారం జరుగుతున్నది.గత 20 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఏఐసీసీ.. సీఎంకు ఫోన్​ చేసి ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా చెరువులు, కుంటల స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోన్న హైడ్రా దూకుడుపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంటోన్న వ్యవహారం గురించి ఆరా తీసిన అధిష్టానం సీఎం కు ఫోన్​ చేసి వివరణ కోరినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు  మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రజావ్యతిరేక పెరగకముందే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఆదేశించడంతోనే రేవంత్​ రెడ్డి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో పాటు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఈడీ దాడుల గురించి కూడా అధిష్ఠానం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు దసరాలోపు మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే అధిష్టానంతో పలుసార్లు చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు సంబంధించిన సామాజిక, రాజకీయ వివరాలను నివేదిక రూపంలో అగ్రనేతలకు అందజేసిన విషయం తెలిసిందే. 

12న మంత్రివర్గ విస్తరణ..?

పది నెలల నుంచి ఊరిస్తోన్న మంత్రివర్గ విస్తరణకు ఈ దసరాతో చెక్​ పెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక డిసెంబర్​ 7న 12 మందితో కొలువుదీరిన కాంగ్రెస్​ సర్కార్​ మరో ఆరు పోస్టులను పెండింగ్ లో పెట్టింది. దీంతో అప్పటి నుంచి చాలా మంది సీనియర్లతో పాటు జూనియర్లు, పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలూ మంత్రివర్గంలో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ధిక, సామాజిక, రాజకీయపరంగా అనేక సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఇందులో అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో పలువురికి మంత్రివర్గంలో బెర్త్​ ఖరారైనట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ పలు కారణాలతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్​ పడింది. తాజాగా దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించాలని ప్రభుత్వం ఏఐసీసీ తీసుకున్నట్లు తెలిసింది. అయితే కొత్త మంత్రుల జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి దాదాపు బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి వాకిటి శ్రీహరి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ నాయక్‌కు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మరో రెండు మంత్రి పదవుల్లో ఒకటి మైనార్టీ వర్గానికి, మరొకటి వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఇవ్వొచ్చని పీసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ చీఫ్‌గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మల్‌రెడ్డి రంగారెడ్డి, అద్దంకి దయాకర్‌లో ఎవరో ఒకరికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది. మిగతా కార్పోరేషన్ పదవులు కూడా ముఖ్యమైన నేతలతో భర్తీ చేయనున్నట్లు సమాచారం.