ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..వరద బాధితులకు తక్షణ సాయంగా ₹10వేలు ప్రకటన
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. వరదలతో రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగి నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ప్రతీ కుటుంబానికి నిత్యవసరాలు అందించాలని ఆదేశించారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఖమ్మం వెళ్లే మార్గమధ్యలో దెబ్బతిన్న పాలేరు లెఫ్ట్ కెనాల్, దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాను. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలుసుకుని తక్షణ సహాయం కోసం జిల్లాకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పశువులు చనిపోతే రూ.50 వేలు, పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల పరిహారం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్నీ విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వరద ప్రజల బతుకుల్లో విషాదాన్ని నింపాయన్నారు. బాధితులను ఆదుకునేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. గత 60, 70 ఏళ్లలో ఇంత భారీ వర్షం చూడలేదని చెబుతున్నారు. వరదలో రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన చెందారు. కష్టపడి సంపాదించుకున్నవన్నీ వరద నీటిలో మునగడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ పిల్లల సర్టిఫికెట్లు వరద నీటిలో నానిపోయాయని ప్రజలు వాపోతున్నారన్నారు. బాధితులకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.