కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ నిరసన

కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ నిరసన

ముద్ర, పానుగల్:- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా  శుక్రవారం ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పానగల్ మండలం కేతేపల్లి లో ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన చేపట్టారు. కార్మిక చట్టాల నాలుగు కోడ్ లుగా విభజన రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ మాట్లాడారు.

కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో రోజు కూలి రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి ప్రతి ఏటా నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పరిధినాన్ని 12 గంటలకు పెంచటం సరికాదన్నారు. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా, యువత, ఉద్యోగ, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు బిజెపి అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతోందన్నారు. ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు.ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మతం, దేశభక్తి పేరుతో, ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని తిరగబడి పోరాడాలన్నారు. సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, నాయకులు కాకం కాశన్న, కుర్వ హనుమంతు,కాకం చిన్న రాముడు,హుస్సేన్, వేమన్న, వెంకటయ్య, బాలస్వామి, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.