కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్‌? త్వరలో మంత్రివర్గ విస్తరణ..

కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్‌? త్వరలో మంత్రివర్గ విస్తరణ..
cabinet expansion,

త్వరలో చేపట్టనున్న కేంద్ర కేబినెట్‌ విస్తరణలో తెలంగాణకు ఒక బెర్త్‌ను ఖరారు అయిందని విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజీపీ తరఫున నలుగురు ఎంపీలు గెలుపొందారు. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్‌ నుంచి  ధర్మపురి అరవింద్‌ గెలిచారు. కిషన్‌ రెడ్డి ఇప్పటికే  కేంద్ర మంత్రిగా ఉన్నారు. కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.  బండి సంజయ్‌ నాయకత్వం పట్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు పూర్తి విశ్వాసం వుంది. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది కానీ, తాజా సమాచారం  ప్రకారం, బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్‌లోకి  తీసుకుని ఆయన స్థానంలో ఈటల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి బండి సంజయ్‌  పార్టీ  అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాతనే పార్టీలో ఊపొచ్చింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసి, హుజురాబాద్‌ విజయాలు పార్టీకి మరింత ఊపునిచ్చాయి. అందుకే మళ్ళీ ఎన్నికల వరకు బండినే అధ్యక్ష పదవిలో కొనసాగించాలని ముందు నిర్ణయించినా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై  ‘పైచేయి’ సాధించడం మరింత తేలిక అవుతుందని పార్టీ బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించి, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఉభయ  తారక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  

ఈటల రాజేందర్‌కు బీఆర్‌ఎస్‌ లోగుట్లన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ పురుడు పోసుకున్నప్పటి నుంచి, కుటుంబ పార్టీగా రూపాంతరం చెందేవరకు, అనంతర పరిణామాలు అన్నీ ఈటలకు కొట్టిన పిండి. అంతే కాకుండా  ఇప్పటికీ గులాబి పార్టీ నేతలు అందరితోనూ ఈటలకు సన్నిహిత సంబంధాలున్నాయి.  అలాగే ఒక బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈటల అన్ని వర్గాల ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాజేందర్‌ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 16,17 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ  ముహూర్తం ఉంటుందని అంటున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కూడా ఉన్నందున ఈ లోగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని అంటున్నారు. అలాగే  ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీలో, అటు కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పుల ఉంటాయని అంటున్నారు.