ప్రచారం నిల్!

ప్రచారం నిల్!
  • అభ్యర్థులను ప్రకటించినా గ్రామాలకు వెళ్లని బీఆర్ఎస్​నేతలు
  • నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు
  • 34 సెగ్మెంట్లలో అంతర్గత విభేదాలు
  • సొంత నేతలతోనూ దూరం దూరంగా..
  • 66 నియోజకవర్గాల్లో ప్రచారం శూన్యం
  • నేతలు, సర్వే సంస్థల నుంచి సీఎం ఫీడ్​బ్యాక్​
  • రంగంలోకి దిగుతున్న అధినేత కేసీఆర్ 
  • ఈనెల 7 నుంచి వరుస సమీక్షలు
  • బలహీనంగా ఉన్న సెగ్మెంట్ల నుంచే రివ్యూ స్టార్ట్​
  • ప్రచారం మొదలుకాని ప్రాంతాలపై ఫోకస్
  • రేపు కామారెడ్డి నేతలతో సీఎం భేటీ
  • పీకే వీడియోలను విస్తృతంగా వాడుకోవాలంటూ సూచన

అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..​ప్రచారంలో మాత్రం జోరు చూపించడం లేదు. అధినేత తమ పేరునైతే ప్రకటించారు కానీ..  తుది వరకు తాము బరిలోఉంటామో లేదోననే అనుమానాలతో అభ్యర్థులు ఊగిసలాడుతున్నట్లు సమాచారం. దీంతో వారు ప్రచార వేటకు సిద్ధమవడం లేదు. ఈక్రమంలో నేతలు, సర్వే సంస్థల నుంచి ఫీడ్​బ్యాక్​తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పటిదాకా ప్రచారం మొదలుకాని, బలహీనంగా ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్​పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల రెండో వారం నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా కామారెడ్డి నుంచి సమీక్ష ప్రారంభించి.. తర్వాత ఒక్కో సెగ్మెంట్ నేతలతో మాట్లాడేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. 

పీకే వీడియోలు వైరల్ చేయాలని ప్లాన్

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పిన వీడియోలను బీఆర్ఎస్​ విస్తృతంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిని సోషల్ మీడియాతోపాటుగా ఆయా ప్రాంతాల్లో పదేపదే ప్రచారం చేసుకోవాలని సీఎం కేసీఆర్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్​తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో కాం గ్రెస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులు, ఇండియా కూటమి వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే వీడియోను జనాల్లోకి తీసుకెళ్లాలని, దీంతో ఓట్లు ఏకపక్షంగా ఉంటాయని నేతలకు ప్రగతి భవన్ నుంచి సూచనలు వెళ్లాయి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : జమిలి ఎన్నికల వ్యవహారం ఎలా ఉన్నా.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థులను ప్రకటించి ఇన్ని రోజులు గడిచినా ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్లడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఇప్పటిదాకా ప్రచారం మొదలుకాని నియోజకవర్గాల వివరాలు తీసుకున్న సీఎం.. బలహీనంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న పలు సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు.  

34 సెగ్మెంట్లలో అంతర్గత విభేదాలు

పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఆగడం లేదు. సీఎంకు సర్వే సంస్థలు, నిఘా వర్గాలు, పార్టీ నేతలు ఇచ్చిన నివేదిక ఆధారంగా 34 నియోజకవర్గాల్లో అంతర్యుద్ధం జరుగుతున్నట్లు సమాచారం. అయితే, పార్టీలో అసంతృప్త నేతలు, ఆశావాహులను ఒప్పించుకుని వారితో సయోధ్య చేసుకుని ప్రచారం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులతో భేటీ కావాలని, అంతర్గత విభేదాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క సెగ్మెంట్​లో కూడా సొంత పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడలేదని సీఎం కేసీఆర్ పరిశీలనలో స్పష్టమైంది. దాదాపుగా 34 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి చేయి దాటిపోయిందని, సొంత నేతల మధ్య విభేదాలు.. గెలుపోటములపై ప్రభావం చూపుతున్నాయని తేలింది. దీంతో ఇలాంటి సెగ్మెంట్ల నేతలతో సీఎం కేసీఆర్ సొంతంగా మాట్లాడనున్నారు. 

66 నియోజకవర్గంలో ప్రచారం నిల్..

అన్ని పార్టీల కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. వెంటనే కార్యక్షేత్రంలోకి వెళ్లాలని అభ్యర్థులను ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్రం జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు. ఇటు బీఆర్ఎస్​అధిష్టానం కూడా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టికెట్​ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఇటు సొంత పార్టీ నేతలతోపాటుగా నిఘా వర్గాల నుంచి సమచారం సేకరిస్తున్నారు. ఒక్కో సెగ్మెంట్​లో నిశితంగా పరిశీలన చేయించగా అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడంలేదని తేలిపోయింది. ఇలా సుమారు 66 నియోజకవర్గాల్లో సోమవారం వరకు ప్రచారం మొదలు పెట్టలేదని నిఘా వర్గాలు అధినేతకు సమాచారం ఇచ్చాయి

రంగంలోకి అధినేత..

జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు తదితర అంశాంలను పక్కన పెట్టిన సీఎం కేసీఆర్.. నేతలను ప్రచారానికి సిద్ధం చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. విభేదాలతో సతమతమవుతున్న నియోజకవర్గాలతోపాటుగా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో వెనకబడటం, కొంత బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్​పెట్టారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్​రెండో వారం నుంచి వరుస సమీక్షలు ప్రారంభించనున్నారు. ఈనెల 7న కామారెడ్డి నియోజకవర్గ నేతలతో సమీక్షించనున్నారు. తర్వాత ఒక్కో సెగ్మెంట్​నేతలను ప్రగతి భవన్​కు పిలిపించుకుని సీఎం స్వయంగా మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చారు. 

అక్టోబర్ రెండో వారం నుంచి పర్యటనలు..

ముందుగా బలహీనంగా ఉన్న, విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న సెగ్మెంట్ల నేతలతో పార్టీ పరిస్థితులను సమీక్షించనున్నారు. అంతర్గత విభేదాలతో రగలుతున్న నేతలందరినీ ఒకే వేదికగా చర్చించి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలనే ఏకైక ఎజెండాతో రివ్యూలకు శ్రీకారం చుట్టుతున్నారు. ఆ తర్వాత జిల్లాలవారీగా సమీక్షలు చేయనున్నారు. వచ్చేనెలలోగా ఆయా సెగ్మెంట్ల నేతలను ప్రగతిభవన్​కు పిలిపించుకుని మాట్లాడే షెడ్యూల్ చేస్తుండగా.. అక్టోబర్ రెండో వారం నుంచి జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అనుకున్నట్టే అక్టోబర్ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే.. కేసీఆర్​ పర్యటనలు రాష్ట్రమంతా ఉండనున్నాయి.