టెన్షన్! బాబుకు బెయిల్ మంజూరుపై కొనసాగుతున్న ఉత్కంఠ
- నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు
- ఏపీ సీఐడీ కోర్టు ఏడున్నర గంటలు వాదనలు వినిపించిన లాయర్లు
- విజయవాడ కోర్టు ఆవరణలో భారీగా పోలీసుల మోహరింపు
- ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న ఖాకీలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు క్రమంలో ఆదివారం ఏసీబీ కోర్టులో సుమారు ఏడున్నర గంటలు వాదనలు జరిగాయి. మరి కాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించబోతోంది. ఈ క్రమంలో బాబును అరెస్టు చేస్తారా? లేదా కోర్టు బెయిలు మంజురు చేస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించాయి. ప్రధానంగా సెక్షన్ 409పై కీలకవాదనలు జరిగాయి.
ఏడున్నర గంటలు సాగిన వాదనలలో సుమారు రెండున్నర గంటలు 409 సెక్షన్ లో ఉన్న టెక్నికల్ పాయింట్స్ ఆధారంగానే వాదనలు సాగాయి. ఈ కేసులో 409 సెక్షన్లు పెట్టడం సబబు కాదని, ఆ సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపించాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. చంద్రబాబు పాత్ర నిరూపించకుండా 409 వర్తిందని లూథ్రా వాదించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశమిచ్చారు. కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 9 గంటలకే చంద్రబాబునాయుడిని అరెస్టు చేశామని, 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
విజయవాడ కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు
విజయవాడ కోర్టు కాంప్లెక్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో పోలీసులను మోహరించారు. విజయవాడలో బందోబస్తును ప్రత్యక్షంగా సీపీ కాంతి రాణా టాటా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐపీసీ సెక్షన్ 409 అంటే?
చంద్రబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409పై చర్చ జరుగుతోంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం.. ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన ప్రజాసేవకులు వారిని మోసం చేస్తే నేరం కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, కారకం, బ్రోకర్, న్యాయవాదిగా అతడి వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే.. జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించే వివరణతో కూడిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు.