ఖమ్మం కలెక్టరేట్ వద్ద అలైన్ మెంట్ మార్చండి: ఎంపీ రవిచంద్ర

ఖమ్మం కలెక్టరేట్ వద్ద అలైన్ మెంట్ మార్చండి: ఎంపీ రవిచంద్ర
Change alignment at Khammam Collectorate MP Ravichandra

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల సమస్యలపై ఎంపీ నివేదించారు. ఖమ్మం మీదుగా వెళ్లే నాగపూర్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్ మెంట్ ను ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని కోరారు. ప్రతిపాదిత హైవే మార్గం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెళుతుందని, అది రాకపోకలకు అసౌకర్యంగా ఉండటం చేత.. ఆ మార్గాన్ని మార్చి కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లేలా సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే హైవే పై ఖమ్మం, విజయవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట వద్ద కలిసే మార్గంలో అండర్ పాస్ నిర్మించాలని, జాతీయ రహదారి 65 పై చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ వద్ద కూడా అండర్ పాస్ మంజూరు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి ఎంపీ ప్రతిపాదనలపై సత్వర చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.