అర్ధరాత్రి వరకు తనిఖీలు

అర్ధరాత్రి వరకు తనిఖీలు
  • కోదాడలో ఆంధ్రా నకిలీ ఔషధాల మూలాలు
  • రెండు షాపులను టార్గెట్ చేస్తూ ఔషధ నియంత్రణ అధికారుల దాడులు 

ముద్ర ప్రతినిధి , కోదాడ: కోదాడ పట్టణంలో గురువారం సాయంత్రం నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన అధికారులు రెండు షాపులను టార్గెట్ చేసి తనిఖీలు నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం విజయవాడలోని కొన్ని హోల్ సేల్ షాపులపై అధికారులు నిర్వహించిన దాడులలో అనేక కంపెనీలకు చెందిన పలు రకాల ఔషధాలను నకిలీవిగా అధికారులు గుర్తించారు. వాటిని ఎవరెవరికి సరఫరా చేశారో వివరాలు తీయగా కోదాడలో కూడా రెండు హోల్ సేల్ దుకాణాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు జిల్లాకు చెందిన అధికారులు దాడులు నిర్వహించారు.  

రోజ్ వాస్ - 40 , చైమోరాల్ ఫోర్ట్ , గ్లూకోనార్మ్ - జీ1, అనేక ఔషధాలను పరిశీలించగా అప్పటికే వాటిని రిటైలర్లకు అమ్మడంతో అదే కంపెనీకి చెందిన పాన్- డీ, టెల్మా -40 ఔషధాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. పట్టణంలో అధిక విక్రయాలు జరిపే ఆ రెండు షాపులలోనే అధికారులు దాదాపు రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు దాడులు నిర్వహించినట్లు సమాచారం. అడపా దడపా దాడులు చేస్తున్న అధికారులు ఇప్పటికైనా మేల్కొని నిశితంగా పరిశీలిస్తే నకిలీ మందుల గుట్టు వీడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై జిల్లా డ్రగ్ ఇన్ స్పెక్టర్ సురేందర్ ను వివరణ కోరగా దాడులు జరిగింది వాస్తవమే అని , ముందు ముందు మరిన్ని దాడులు చేస్తామని తెలిపారు. బిల్లులు లేకుండా ఎవరు ఔషధాలు కొనవద్దని సూచించారు. ప్రతి షాపు యజమాని కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.