చెన్నమనేని వర్సెస్ చలిమెడ..

చెన్నమనేని వర్సెస్ చలిమెడ..
  • స్వరం పెంచుతున్న వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు
  • చలిమెడల లక్ష్మీనరసింహారావ్ టార్గెట్ గా ఉపన్యాసాలు
  • వేములవాడ నియోజకవర్గంలో చలిమెడ వరుస కార్యక్రమాలతో పెరుగుతున్న దూరం
  • బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గరవుతున్న చలిమెడ లక్ష్మీనరసింహరావ్
  • వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు కు చలిమెడకు పెరుగుతున్న అంతరం
  • బహిరంగ విమర్శలు చేస్తున్న వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు
  • కార్పోరేట్ ఆస్పత్రులతో ఏడాదికి రూ.వంద కోట్లు సంపాదించి కోటి దానం చేస్తున్నరంటూ రమేశ్ బాబు సంచలన వాఖ్యలు
  • ప్లెక్సీలు పెడితే నాయకులు కారంటూ పరోక్ష విమర్శలు
  • వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాల్లో ‘చలిమెడ’ సెగ
  • రమేశ్ బాబుకు కౌంటర్ ఇచ్చిన చలిమెడ లక్ష్మీనరసింహరావ్
  • అధిష్టానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడ పోటీ చేస్తా.. చలిమెడ
  • అధిష్టానానికి తలనొప్పిగా మారిన వేములవాడ రాజకీయాలు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజవర్గంలో బీఆర్ఎస్ లో రాజకీయాలు ముదురుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు , చలిమెడ వైద్య విద్య సంస్థల చైర్మన్ చలిమెడ లక్ష్మీనరసింహరావ్ కు రాజకీయ అంతరం పెరిగిపోతుంది. ఎమ్మెల్యే రమేశ్ బాబు, చలిమెడ లక్ష్మీనరసింహరావ్ లు రాజకీయ మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్ బాబు  బహిరంగ సభల్లో లక్ష్మీనరసింహారావ్ ను టార్గెట్ చేస్తూ తన ఉపన్యాసాలు ఇస్తుంటే.. మరుసటి రోజు అదే మండలంలో లక్ష్మీనరసింహారావ్ ఓ సమావేశానికి హజరై.. ఎమ్మెల్యే రమేశ్ బాబు విమర్శలకు కౌంటర్ ఇవ్వడం వేములవాడ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. 

చెన్నమనేని వర్సెస్..చలిమెడ.. మధ్యలో బాబాయ్ కొడుకు వికాస్

వేములవాడ రాజకీయాల్లో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చెన్నమనేని రాజేశ్వర రావ్ తనయుడు చెన్నమనేని రమేశ్ బాబు రాజేశ్వర్ రావ్ రాజకీయ వారసత్వం తీసుకోని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రమేశ్ బాబుకు రాజకీయ భౌవిష్యత్కు అడ్డంకిగా సొంత సామాజిక వర్గానికి చెందిన వారే పోటీకి రావడంతో వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు రాజకీయంగా పోట గా చలిమెడ లక్ష్మీనరసింహారావ్ ఒక వైపు.. సోంత బాబాయ్ చెన్నమనేని విద్యాసాగర్ రావ్ కొడుకు వికాస్ రావ్ మరో వైపు ప్రతిపక్షాలుగా తయారయ్యారని రాజకీయంగా చర్చ కొనసాగుతుంది.

వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుపై కన్నేసి ఓ వైపు విద్యాసాగర్ రావ్ తనయుడు వికాస్ రావు, మరో వైపు చలిమెడ ఆనందరావ్ తనయకుడు లక్ష్మీనరసింహారావ్ లు వేములవాడ నియోకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చలిమెడల లక్ష్మనరసింహరావ్ కోనరావుపేట మండలం మల్కపేటలో రూ.కోటిన్నర వెచ్చించి ప్రభుత్వ పాఠశాల భవనంనే నిర్మించి ప్రభుత్వానికి అప్పగించాడు. రూ.కోట్లు వెచ్చించి ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు. వేములవాడ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ తన క్యాడర్ తోచర్చలు జరుపుతూ.. రాజకీయంగా పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో  వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు కోనరావుపేట మండలం నాగారంలో సంచలన వాఖ్యలు చేశాడు. ఎన్నడు లేని విధంగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు బహిరంగ విమర్శలకు.. సవాళ్లకు దిగుతుండటంతో వేములవాడ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని.. ఎమ్మెల్యే రమేశ్ బాబు ప్రతిపక్షాల నాయకులను కూడా అంతగా పట్టించుకోరు..తన పని తాను చేసుకుంటూ వెళుతూ.. ఇప్పటికే నాలుగు సార్లు వేములవాడ ఎమ్మెల్యే గెలుపొంది.. వేములవాడ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కానీ కోనరావుపేట మండలంలో ఎమ్మెల్యే రమేశ్ బాబు పరోక్షంగా చలిమెడ వైద్య విద్యా సంస్థల చైర్మన్ చలిమెడ లక్ష్మీనరసింహారావ్ను ఉద్దేశించి ప్రసగించారు. కార్పోరేట్ వైద్య సంస్థలు పెట్టి ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించి ఓ రూ.కోటి దానం చేస్తే అది దానం అంటారా..? అది త్యాగం అవుతుందా అంటూ రమేశ్ బాబు ప్రశ్నించారు. నన్ను మెత్తటోన్ని అనుకుంటున్నారు.. నాకు నా తండ్రి రాజేశ్వర రావ్ ఓపిక నేర్పించాడు.. రాజేశ్వర రావ్ దెబ్బ కొడితే రాజకార్లే పారిపోయారు అంటూ సంచలన వాఖ్యలు చేశారు. వేములవాడ నియోజకవర్గం తనకు కాదని, రాజేశ్వర్ రావ్ ఇచ్చిన పేగుబంధం వేములవాడ అని.. ఈ పేగుబంధాన్ని ఎవరు తెంచలేరని వాఖ్యనించారు.

ప్లెక్సీలు కట్టినంత మాత్రన నాయకులు కారని, అలా ఐతే తాను ఊరు మొత్తం కట్టిస్తానంటూ వాక్యానించారు. ప్రతి సారి ప్రెస్ వాళ్లు నాకు టికెట్ రాదని, ఓడిపోతారని రాస్తున్నరని, రాసుకుంటే రాసుకొండి.. ఒక్కసారి కాదు ఇంకా నాలుగు సార్లు గెలస్తాను.. ప్రజల ఆశీర్వాదం ఉందంటూ పేర్కొన్నారు. కార్పోరేట్ హస్పీటల్స్ పెట్టి ఏటా రూ.వంద కోట్లు సంపాదించి.. ఇక్కడకి వచ్చి రూ.కోటి దానం చేస్తున్నరన్నారు. తెల్లవారి లేస్తే చాలు వ్యాపారం చేసే వారు.. ఒక్క ఎంబిబిఎస్ సీటు ఇవ్వమన్న పేదలకు ఇవ్వరని, ఒక్కో సీటు రూ.రెండు కోట్లుకు అమ్ముకుంటారంటూ రమేశ్ బాబు పేర్కొన్నారు. దమ్ముంటే ఒక బీసీ విద్యార్థికి ఎంబిబిఎస్ సీటు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏకంగా చలిమెడ, ప్రతిమ, ఆనందరావ్ వైద్య విద్యా సంస్థల పేర్లను ఉచ్చరిస్తూ తన స్పీచ్ ఇవ్వడం రాజకీయ చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఎమ్మెల్యే రమేశ్ బాబు చలిమెడ లక్ష్మీనరసింహారావ్ను పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 

మరుసటి రోజే చలిమెడ లక్ష్మీనరసింహారావ్ కౌంటర్

వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం నాగారంలో ఫిభ్రవరి 17న రమేశ్ బాబు బహిరంగ విమర్శలు చేసి వెళితే.. చలిమెడ లక్ష్మీనరసింహారావ్ 19న వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం మల్కపేట లో శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని ఈ అంశాన్ని లెవనెత్తాడు. తాను మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చానని.. పార్టీ అధిష్టానం వేములవాడ పోటీ చేయమంటే వేములవాడలో చేస్తా.. కరీంనగర్ చేయమంటే కరీంనగర్ లో చేస్తా.. ఎంపిగా వెళ్లమంటే ఎంపిగా పోటీ చేస్తా.. సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే కమిట్మెంట్ కార్యకర్తగా పని చేస్తానంటూ లక్ష్మీనరసింహారావ్ వాఖ్యానించారు. నాకు రాజకీయాలు కొత్త కాదని, తన తండ్రి ఆనందరావ్ ఎంపిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలందించారని, తాను కూడా ఒక సారి ఎంఎస్సీగా..రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉందన్నారు. ప్రజా సేవ, సామాజిక సేవ కార్యక్రమాలు కొత్తగా చేయడం లేదంటూ పాత్రికేయుల ముందు చలిమెడ లక్ష్మీనరసింహారావ్ వాఖ్యనించి ఎమ్మెల్యే రమేశ్ బాబుకు పరోంగా కౌంటర్ ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గ రాజకీయాలు చెన్నమనేని వర్సెస్ చలిమెడగా మారాయి. దీంతో ఈ వేములవాడ నియోజకవర్గ రాజకీయ వర్గపోరు బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ వర్గపోరు ఎక్కడిదాక వెళతాయో.. ఎవరి రాజకీయ తలరాతలు తలకిందులు అవుతాయో వేచి చూడాలి.

బీఆర్ఎస్ ముఖ్యులకు దగ్గరవుతున్న చలిమెడ..

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన చలిమెడ లక్ష్మీనరసింహారావ్ కరీంనగర్ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆనందరావ్ కు రాజకీయాలు కలిసి వచ్చిన కొడుకు లక్ష్మీనరసింహారావ్కు అంతగా కలిసిరాలేదు. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీనరసింహారావ్ సిఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చాలా దగ్గరయ్యారు. కేటీఆర్ రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఎక్కడ పర్యటించిన లక్ష్మీనరసింహారావ్ దర్శనమిస్తున్నాడు. అదే విధంగా కేటీఆర్ సైతం లక్ష్మీనరసింహారావ్ కు ఈ మద్య చాలా ప్రధాన్యత ఇస్తున్నారు. దూరంగా నిలబడిన కూడా లక్ష్మీనరసింహారావును దగ్గరకు పిలచుకోని మరి.. స్టేజీపైకి ఆహ్వనించడం.. వంటి దృశ్యాలు తరుచు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానానికి చలిమెడ లక్ష్మీనరసింహారావ్  దగ్గరవుతున్న.. ఏములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు మాత్రం రాజకీయంగా విబేధాలతో దూరం అవుతున్నరన్న చర్చ కొనసాగుతుంది.