సీఎం సభకు ‘చేర్యాల’ ముస్తాబు

సీఎం సభకు ‘చేర్యాల’ ముస్తాబు
  • ప్రజా ఆకాంక్ష మేరకు కేసీఆర్‌‌ రాక
  • బీఆర్ఎస్ జనగామ భ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల): సీఎం కేసీఆర్‌‌ సభకు జనగామ నియోజకవర్గంలోని చేర్యాల సుందరంగా ముస్తాబైంది. పట్టణ కేంద్రంలోని మార్కెట్ పక్కన ఏర్పాటు చేసిన సభ ప్రాంగణాన్ని జనగామ బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం పరిశీలించారు.  అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ చేర్యాల ప్రజల ఆకాంక్ష, వారి కోరికలు తీర్చేందుకే సీఎం కేసీఆర్‌‌ నేడు చేర్యాలకు వస్తున్నారని చెప్పారు. 

నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎంకు స్వాగతం పలికేందుకు రెడీ ఉన్నారన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంపై ఇప్పటికే జనగామ సభలో సీఎం హామీ ఇచ్చారని, దానినే మళ్లీ ఆయన దృష్టికి తీసుకెళ్తానని, కచ్చితంగా డివిజన్ సాధించుకుని తీరుతామన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని రెండు సార్లు ఎలా ఆదరించారో అలాగే తనను కూడా ఆదరించాలని కోరారు. ప్రజా ఆశీర్వాద విజయవంతం చేసేందుకు బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు కంకనబద్దులై పనిచేయాలని పిపునిచ్చారు.