నేడు మహబూబాబాద్ జిల్లాకు రానున్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

నేడు మహబూబాబాద్ జిల్లాకు రానున్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మహబూబాబాద్-సూర్యపేట 365 నంబర్ జాతీయరహదారిపై పురుషోత్తయగూడెం బ్రిడ్జి వద్ద ఆకేరువాగుసృష్టించిన విద్వంసాన్ని ఆయన పరిశీలిస్తారు. ఈ..బ్రిడ్జివద్ద కారు వరదనీటిలో కొట్టుకపోవడంతో గంగారంతండాకు చెందిన తండ్రి,కూతురు మరణించిన విషయం తెలిసిందే. ఖమ్మం నుండి 10గంటలకు బయలుదేరి ముఖ్యమంత్రి మొదట గంగారంతండాకు చేరుకుంటారు. అక్కడ ఆకేరులో ప్రమాదవశాత్తు మరణించిన తండ్రి,కూతురు కుటుంబసభ్యులను పరామర్శించి నేరుగా రోడ్డుమార్గం ద్వారా పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు.

అనంతరం జలదిగ్బందానికి గురై, వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డ సీతారాంపురం తండాను సందర్శించి అక్కడ గిరిజనులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని జిల్లాలోని వరద పరిస్థితులపై అధికారులతో ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలోనే హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం ఉదయమే పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి, సీతారాంపురం తండాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి పలు సూచనలు చేశారు.