నిజమైన తెలంగాణ ఇప్పుడే వచ్చింది

నిజమైన తెలంగాణ ఇప్పుడే వచ్చింది
  • ఇన్నేళ్లు దొరల కబంధహస్తాల్లో తెలంగాణ
  • వనపర్తిని సమగ్ర అభివృద్ధి చేసుకుందాం
  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి :తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల క్రితం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ పాలనలోనే లభించిందని డాక్టర్ జి  చిన్నారెడ్డి అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులై మొదటిసారి బుధవారం వనపర్తికి వచ్చిన సందర్భంగా బుద్ధారం గండి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి నాగవరంలోని పద్మావతి శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటుచేసిన సన్మాన సభలో పాల్గొని చిన్నారెడ్డి మాట్లాడారు.   హైదరాబాదుకు మొదట స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పాలమూరు జిల్లా వాసి అయిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని, అలాగే 71 సంవత్సరం తర్వాత మళ్లీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు.

వనపర్తి ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ,  ప్రభుత్వం తనకు సముచిత స్థానం కల్పించిందని అందుకు సోనియాగాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో  సోనియా గాంధీ స్వయంగా తన పేరును టీక్ చేసి పంపిందని, అయితే పోటీ పడుతున్న అభ్యర్థి ధనికుడని, డబ్బు బాగా సంపాదించాడని, చిన్నారెడ్డి నిజాయితీపరుడు కావున డబ్బులు లేవని, పోటీ పడలేదని చెప్పి తన పేరును మార్చారని ఆయన తెలిపారు. పార్టీ నిర్ణయించిన ప్రకారం పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించామని అన్నారు. చిన్నారెడ్డికి సముచిత స్నానం స్థానం కల్పించాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికా సంఘం బాధ్యతలతో పాటు, ప్రజావాణి బాధ్యతలను అదనంగా ఇచ్చారని ఆయన అన్నారు. వినియోగం చేసుకొని పార్టీ ప్రతిష్టకు, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వనపర్తిని సమగ్ర అభివృద్ధి చేయాలన్నది తన తపన అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.

వనపర్తికి రైల్వే లైను, పారిశ్రామిక కేంద్రం, ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రతి గ్రామానికి విద్య వైద్యం అందేలా చూస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల లో 6 గ్యారంటీలను అంచలంచలుగా  అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశామని ఆయన చెప్పారు.గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని, ప్రజాసేవ మరిచి సొంత ఆస్తులు కూడబెట్టుకునేందుకు కృషి జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రజలు కలువ లేని పరిస్థితి ఉండేదని, ప్రగతి భవన్ ను ఇనుప గోడలతో, ఇనుప కంచతో ప్రజలను రానివ్వకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనుప గోడలను బద్దలు కొట్టి కంచను తొలగించారని అన్నారు. అదే ప్రగతి భవన్ లో ప్రజావాణి నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నిర్బంధ పాలన చేసినందుకే బీఆర్ఎస్ ను ప్రజలు పక్కన పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుందని ఆయన అన్నారు. అనంతరం చిన్నారెడ్డిని గజమాలతో శాలువాలతో పూల బొకేలతో సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.