తిరుమలగిరిలో బిఆర్ఎస్ ధర్నా సందర్భంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

తిరుమలగిరిలో బిఆర్ఎస్ ధర్నా సందర్భంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు
  • తిరుమలగిరి వస్తున్న మాజీ మంత్రిని అడ్డుకున్న పోలీసులు

తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు రుణమాఫీ ధర్నా సందర్భంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది .బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుమలగిరిలో మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సారధ్యంలో ధర్నా నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల  కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇరు వర్గాలు రాళ్లు రువుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణ వాతావరణం పసిగట్టిన పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించి ఘర్షణకు దిగిన ఇరుపక్షాలను చెదరగొట్టారు. పరిస్థితిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో తిరుమలగిరిలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పరిస్థితిని నివురు గప్పిన నిప్పులా ఉందని తెలుస్తోంది.

తిరుమలగిరిలో కార్యకర్తలపై దాడి సంఘటన తెలుసుకున్న మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుండి తిరుమలగిరి వస్తుండగా డీఎస్పీ  సారధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.  ప్రస్తుతం తిరుమలగిరిలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ ధర్నాకు ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.