ప్రభుత్వాసుపత్రిలో అర్ధరాత్రి కలెక్టర్

ప్రభుత్వాసుపత్రిలో అర్ధరాత్రి కలెక్టర్

ఖమ్మం, ముద్ర: అది జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం.. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. ఉన్నత స్థాయి అధికారి ప్రభుత్వ వాహనం వచ్చి ఆగింది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సిబ్బంది తేరుకునేలోపే  ఉన్నత స్థాయి అధికారి ఆసుపత్రిలోని విభాగాలను కలియ తిరిగారు. ఆయనే జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డు , మెటర్నిటీ లేబర్ రూమ్ ను సందర్శించి, డాక్టర్, సిబ్బంది విధుల్లో  ఉన్నారా లేరా అని పరిశీలించారు. ఎన్ని కేసులు ఉన్నాయని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

క్యాజువాలిటీ, ఐసీయూలను పరిశీలించారు. ఎంత మంది ఇన్ పేషెంట్లు ఉన్నది, రోజువారి ఓపీ ఎంత ఉన్నదనేది  పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. లేబర్ రూమ్ లో ఉన్న డాక్టర్ షహనాజ్ తో మాట్లాడారు. ఎంసీహెచ్ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి (పాత భవనం )ని పరిశీలించారు. క్యాజువాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేదవారు వస్తారని, వారికి సకాలంలో సరైన వైద్యం అందించాలని సూచించారు. నిధులు వెచ్చించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తున్నదని, వైద్యులను కూడా అందుబాటులో ఉంచిందని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వం కల్పిస్తున్న సేవలపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ, రోగుల పట్ల వైద్యులు మానవతా దృక్పథంతో మెలగాలన్నారు. మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంచాలన్నారు.  రోగులతోనూ కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.