బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల భూములు కబ్జా
- అక్రమార్కులను ప్రభుత్వం విడిచిపెట్టదు..
- భూముల పరిరక్షణకు సీఎం , మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి
- హైడ్రా తరహాలో కరీంనగర్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతా..
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు యదేచ్చగా కబ్జాకు గురయ్యాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ హయంలో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పేదల భూములను సైతం వదలలేదని పేర్కొన్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములు కబ్జా కబ్జా చేశారని ఆరోపించారు.
గతంలో నిరుపేదలు తమ భూములు కబ్జా అయ్యాయని అధికారులు, నాయకులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ధరణి పేరిట వందలాది వ్యవసాయ భూములను కాజేశారని ఆరోపించారు. కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పేదలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరీంనగర్లో భూకబ్జాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని తెలిపారు. అన్యాయం జరిగిన పేదలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి భూకబ్జాలపై ఫోకస్ పెట్టారని, ఇప్పటికే భూ కబ్జాల్లో పాత్ర ఉన్న కొంతమంది కార్పొరేటర్లు, నాయకులను సైతం అరెస్టు చేశారని తెలిపారు. సిపి నిజాయితీగా పనిచేస్తూ పేదల పక్షాన నిలుస్తున్నారని చెప్పారు. ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో, మానేరు వాగు పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములు బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు.
గతంలో మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు కు ఈ కబ్జాలు కనపడలేదా.. ఎందుకు అడ్డుకోలేక పోయారు.. ఇందులో మీ పాత్ర ఉందా.. లేదా ప్రజలకు కబ్జాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయంలో భూములను కబ్జా చేసిన అక్రమార్కులను వదిలి రేకుర్తిలో పేద ముస్లింల ఇండ్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పేదల ఇండ్లను ధ్వంసం చేయడం పద్ధతేనా అని ప్రశ్నించారు.
ప్రైవేటు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమార్కులను ప్రభుత్వం వదలదని తెలిపారు. ఎంతటి వారు ఉన్నా చర్యలు తీసుకొని తీరుతుందని పేర్కొన్నారు. భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.
ఇటీవల కరీంనగర్లో పర్యటించిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టరు పోలీస్ కమిషనర్ తో ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఒక్క గుంట ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారని పేర్కొన్నారు. అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచి పెట్టవద్దని, పేదలకు అండగా నిలవాలని సూచించారని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన భూకబ్జాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దృష్టి సారించారని వెల్లడించారు.
హైడ్రా తరహాలో కరీంనగర్ లో వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతా...
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) తరహాలో ప్రత్యేక వ్యవస్థను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులను కోరుతానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
కబ్జాల బారిన పడి అన్యాక్రాంతమవుతున్న పార్కులు, ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఒక ప్రత్యేక వ్యవస్థను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని విన్నవిస్తానని తెలిపారు. దీని ద్వారా వేలకోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఉంటాయని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.