మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బంద్ భగ్నం

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బంద్ భగ్నం

కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన పోలీస్ లు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంచిర్యాల జిల్లా బంద్ పిలుపును పోలీస్ లు భగ్నం చేశారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ ను విఫలం చేయడంలో భాగంగా పోలీస్ లు కొంత మంది మున్సిపల్ కౌన్సిలర్ లను ఉదయమే ఇంటి వద్ద అరెస్టు చేశారు. 

పోలీస్ లను పరుగులు పెట్టించిన నేతలు

బంద్ సందర్భంగా ర్యాలీకి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీస్ లు అరెస్టు చేయడానికి కూరగాయల మార్కెట్ చౌరస్తా కు చేరుకున్నారు. అయితే పోలీస్ ల సంఖ్యా బలం తక్కువగా ఉండడంతో ఇకరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగానే మిగతా నేతలు మార్కెట్ రోడ్ వైపు నినాదాలు చేస్తూ వెళ్లారు. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడానికి పోలీస్ లు పరిగులు తీయాల్సి వచ్చింది. పోలీస్ లు పెద్ద సంఖ్యలో చేరుకోగా దొరికినవారిని దొరికినట్లుగా అదుపులోకి తీసుకుని పోలీస్ కార్లు, ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల  అరెస్టును డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నిశితంగా ఆక్షేపించారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్యగా ఆమె అభివర్ణించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టు పంటకు నీరందించే వరకు ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.