పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ దే గెలుపు ...

పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ దే గెలుపు ...
  • షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 
  • పాలమూరుకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు 
  • ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ కోసం భారీగా తరలిన శ్రేణులు 

ముద్ర/షాద్ నగర్, మహబూబ్ నగర్:- పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చంద్ రెడ్డి నామినేషన్ను పురస్కరించుకొని శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూక్ నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో అభిమానులు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమానికి వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వస్తున్నాడంతో ఈ సందర్భంగా వందలాది వాహనాలలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. చల్లా వంశీచంద్ రెడ్డితో పాలమూరు జిల్లా ఎంతో అభివృద్ధి సాధించడం ఖాయమని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో చేపట్టడం జరుగుతుందని వివరించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు చెప్పే మాయమాటలు ఎవరు నమ్మవగానే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా చివరకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా పని చేశారో అంతకు రెట్టింపు పార్లమెంటు ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురావాలన్న కాంగ్రెస్ అభ్యర్థులు పార్లమెంటులో ఉంటేనే విధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎలా ఉందో అదే తరహాలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పాలమూరు జిల్లాతో పాటు నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, జంగ నరసింహ, వీరేశం, చల్ల శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజు, పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, టీపీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకుడు రఘు, కాంగ్రెస్ సీనియర్ నేత చెంది తిరుపతిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ముదిరాజ్, జితేందర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, అశోక్ లు పాల్గొన్నారు.