గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి - మంత్రి జూపల్లి కృష్ణారావు

గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి  - మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర.వీపనగండ్ల:-గ్రామాల అభివృద్ధికి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వీపనగండ్ల మండలం  సంగినేనిపల్లి గ్రామంలో  రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి  జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ…  

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం  నిధులు కేటాయిస్తామని అన్నారు.  గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ప్రజల వద్దకే ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకువచ్చామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దీన్నే రిజర్వాయర్ వరకు ప్రత్యేక కాలువ నిర్మాణానికి సుమారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, కొందరు నాయకుల నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగాయని, ఇప్పటికీ కొంత భూ సేకరణ సమస్య ఉందని తొందరలోనే సమస్యను పరిష్కరించి సంవత్సరంలోపు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.గత పాలకులు రాష్ట్ర ఖజానాని 60 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, వివిధ అభివృద్ధి పనులకు మరో 20 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని అందుకు గత పాలకుల అవినీతి అక్రమాలే కారణమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.

గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సంక్రాంతి పర్వదినాన గ్రామ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని గ్రామస్తులకు వివరించారు. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని, ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా అనారోగ్యం పాలు అవుతే కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్ళవద్దని, తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రుల్లోనే అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలు అందుతున్నాయని అంతేకాక ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుందని అన్నారు. కార్యక్రమంలో లోకల్ బాడీ కలెక్టర్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, జడ్పిటిసి మాధురి,కిరణ్ గౌడ్, తూముకుంట సింగిల్ బిండ చైర్మన్ రామన్ గౌడ్, సర్పంచ్ మౌలాలి, ఉప సర్పంచ్ లక్ష్మణ్, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి,ఏత్తం కృష్ణయ్య, నాయకులు గంగిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, చక్ర వెంకటేష్,విజయ్ భాస్కర్ రెడ్డి, ధనుంజయ, చిన్నారెడ్డి,రామిరెడ్డి తదితరులు ఉన్నారు.