బీసీలను అణచివేస్తున్న కాంగ్రెస్ 

బీసీలను అణచివేస్తున్న కాంగ్రెస్ 

రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో, రాష్ట్రంలో బీసీలను అణచివేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఎఫ్.సీ.ఏ.ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన యాదవుల శంఖారావం సభకు శ్రీనివాస్ యాదవ్ , షాద్ నగర్ ఎమ్మెల్యే  అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను నాటి నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటివరకు బీసీలను, ముఖ్యంగా యాదవులను రాజకీయంగా అణచివేస్తోంది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన విమర్శించారు. పార్టీలకు అతీతంగా వాస్తవాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ ఉంటే రాజకీయంగా పైకి వస్తారని ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేసే కేంద్రానికి పంపినప్పటికీ ఇంకా పెండింగ్ లోనే పెట్టారని ఆయన ఆరోపించారు.

యాదవులు విశ్వాసం, నిజాయితీగా ఉంటారనే ఉద్దేశ్యంతో హుజురాబాద్  ఉప ఎన్నికల్లో తనకు టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆరుగురు యాదవులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ముఖ్యంగా యాదవులకు ఎంతో అండగా ఉంటున్నారని ఆయన కొనియాడారు. బీఆరెస్ ను మూడవసారి అధికారంలోకి తీసుకురావడంలో యాదవులు క్రియాశీలక పాత్ర వహించాలని కోరారు. ఆర్థికంగా ,రాజకీయంగా ఎదగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుల సహకారం ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అజయ్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలకు ,కుల సంఘాలు భవనాలు నిర్మించుకునేందుకు స్థలంతో పాటు నిధులను  కేటాయించడంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చొరవ తీసుకున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.  సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వరరావు, మేకల గొర్రెల ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.