పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష

పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష

 లోక్‌సభ నుంచి రాహుల్‌ గాంధీ పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఒకరోజు 'సంకల్ప్‌ సత్యాగ్రహ'ను ప్రారంభించింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్‌ నేతలు చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరామ్‌ రమేశ్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, ముకుల్‌ వాస్నిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీ కాంగ్రెస్‌ శాఖకు చెందిన పలువురు నేతలు కూడా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అయితే, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను మాత్రం పోలీసులు అనుమతించడం లేదు.

శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా రాజ్‌ఘాట్‌ దగ్గర సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వలేమని తెలియజేస్తూ దిల్లీ పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి లేఖ రాశారు. అలాగే ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల అనుమతి నిరాకరణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. ''పార్లమెంటులో మా గొంతునొక్కిన ప్రభుత్వం.. ఇప్పుడు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుతంగా దీక్షను చేపట్టడానికి కూడా అనుమతించడం లేదు. ప్రతిపక్షాల నిరసనను అణచివేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. వారు మమ్మల్ని ఆపలేరు. సత్యం కోసం నిరంకుశపాలనపై పోరాడుతూనే ఉంటాం'' అని అన్నారు.a