దగ్గు మందు (మత్తు) కేరాఫ్ కోదాడ

దగ్గు మందు (మత్తు) కేరాఫ్ కోదాడ
  • ఆల్కహాల్ కన్నా ప్రాణాంతకం కొడైన్

ముద్ర ప్రతినిధి ,కోదాడ:- రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి , డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర పట్టుకొని పోలీసులు కేసులు నమోదు చెయ్యడం సర్వసాధారణం . కానీ కోదాడ లో గంజాయితో పాటు నిషేధిత దగ్గు మందు సీసాలను కొందరు మందుల దుకాణ యజమానులు విచ్చల విడిగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు . లైసెన్స్ ఉన్నదని చెపుతూ నిబంధనలు తుంగలోతొక్కి సాగిస్తున్న ఈ దందాలో యువత చిత్తవుతుంది . వారం క్రితం కోదాడ ఎక్సయిజ్ పోలీసులు చేధించిన ఈ దగ్గు మందు రాకెట్ లో కోదాడ , హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన యువకులు , విద్యార్థులు 800 వరకు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . తమ స్వలాభం కోసం యువత భవిష్యత్ ను చిత్తూ చేస్తున్న కొంతమంది మందుల దుకాణ యజమానులు వ్యవహార శైలి పై పట్టణ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . 

అసలు దగ్గు మందు ఏమిటి ? దాని దుష్ప్రభావాలు ఏమిటి?

కోడైన్ ఫాస్పెట్ మందు కలిగిన దగ్గు టానిక్ లలో కోడైన్ అనే వ్యసనం కలిగించే ఓపియాయిడ్ ఉంటుంది. దగ్గు సిరప్ లో ఉండే కోడైన్ అనేది నల్లమందు నుండి తీసుకోబడిన ప్రో-డ్రగ్ . ఇది కాలేయంలో మార్ఫిన్‌గా మారుతుంది. చాలామంది దగ్గుతో బాధపడుతున్నవారు వారికి తెలియకుండానే దగ్గు సిరప్ నిత్యం తాగి వ్యసనానికి బానిసలవుతున్నారు.

ఇక దగ్గు మందు బాటిల్ పై ఎటువంటి హెచ్చరికలు ఉండని కారణంగా వారు వాటికి బానిసలుగా అవుతున్నారు. ఇక దగ్గు మందులో ఉండే కోడైన్ మనిషి శరీరం తీవ్ర ప్రభావం చూపిస్తుంది . ఒకటి రెండు సార్లు తీసుకున్నవారు ఇది లేకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరుకొని వింతగా ప్రవర్తిస్తుంటారు . చాలామంది వ్యసనపరులు ఈ దగ్గు మందులను మత్తు కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొడైన ఫాస్పెట్ కాంబినేషన్ తో కేవలం ఒక్క రకం దగ్గు మందు మాత్రమే దుకాణాలలో అందుబాటులో ఉంది . 100 మిల్లీలీటర్ల ఈ దగ్గు మందు సీసా ఎమ్మార్పీ 175 కానీ యువత వీటి కోసం ఎంతైనా చెల్లించడానికి వెనుకాడట్లేదు . దీనిని అదునుగా భావించి వారి అవసరాన్నిబట్టి 300 నుండి 500 వరకు సొమ్ము చేసుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు కొందరు మందుల దుకాణ యజమానులు . 

దగ్గు మందు ఎలా సేవిస్తారు ? ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి?

మత్తు కోసం వెంపర్లాడుతున్న యువత , కాలేజీ విద్యార్థులు వీటిని కొనుగోలు చేసి సోడాలలో, కూల్ డ్రింక్స్ లో మిక్స్ చేసి తాగుతున్నారు. దగ్గుమందులోని కోడైన్ మరింత ప్రభావవంతంగా పని చేయడానికి దీనిని తాగిన తర్వాత, వేడి టీ ని కానీ కాఫీ ని గానీ తీసుకుంటారు. కోడైన్ కలిగిన దగ్గు సిరప్ వల్ల మత్తు రావడం, అస్పష్టంగా మాట్లాడడం, వినిపించడంలో తేడా, గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరగడం, అస్పష్టమైన దృష్టి, బిపి పెరగడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కోడైన్ కలిగిన దగ్గు సిరప్ తాగిన వ్యక్తి మాదక ద్రవ్యాలను తీసుకున్న వ్యక్తి వలె ప్రవర్తిస్తారు. దీర్ఘ కాలం ఈ దగ్గు మందు వాడిన వారికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు . అలాగే నాడీ వ్యవస్థ పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు .

అధికారులు అడ్డుకట్ట వేస్తారా?

యువత భవిష్యత్ ను చిత్తు చేస్తున్న గంజాయి నిషేధం పై దృష్టి పెట్టిన సివిల్ పోలీసులు అంతకంటే ప్రమాదకరంగా మారిన దగ్గు మందు దందాపై ఉక్కు పాదం మోపాలని పలువురు తల్లితండ్రులు కోరుతున్నారు . వారం క్రితం కోదాడ ఎక్సయిజ్ పోలీసులు పకడ్బందీ వ్యూహంతో దగ్గు మందు దందాను ఛేదించిన తీరును పలువురు అభినందిస్తున్నారు . దీనిని స్ఫూర్తిగా తీసుకోని సివిల్ పోలీసులతో పాటు ఔషధ నియంత్రణ అధికారులు ఈ దందాపై ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు . ఈ దగ్గు మందుతో పాటు ప్రమాదకరమైన ఔషధాలయిన ట్రామడాల్ మాత్రలు  , ఆల్ప్రజోలం మాత్రలు  , ఫోర్ట్ విన్ ఇంజక్షన్ లు , సిల్డినాఫిల్ సిట్రేట్ మాత్రలు మరియు ఇతర యాంటీ బయోటిక్స్ ఇంజక్షన్ల పై కూడా దృష్టి సారించ. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు , యువత భవిష్యత్ ను కాపాడాలని వారు కోరుతున్నారు .