కౌన్సిల్ తీర్మానాన్ని అధికారులు అమలు చేయాలి

కౌన్సిల్ తీర్మానాన్ని అధికారులు అమలు చేయాలి
  • రోడ్ల విస్తరణ పనులు యధావిధిగా కొనసాగుతాయి
  • కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : కౌన్సిలర్లు తీర్మానించిన ప్రతి పనిని అధికారులు అమలు చేయాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి మున్సిపల్ 2024 25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కౌన్సిలర్లకు అధికారులకు మధ్యసమన్వయ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు విధివిధానాలను విస్మరించకుండా పనులు చేయాలని ఆయన ఆదేశించారు. మున్సిపాలిటీకి ఆదాయాన్నిచ్చే హౌస్ టాక్స్ లు ఇతర వాటిపై అధికారులు దృష్టి సారించాలని, అనుకున్న విధంగా టాక్స్లు ఎందుకు వసూలు చేయడం లేదని, విధులను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మున్సిపల్ సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఇకపై జరిగే ప్రతి మున్సిపాలిటీ సమావేశానికి అందరూ అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకించే పనులపై సమస్యలపై కౌన్సిలర్లు అందరూ మొక్కుమాడిగా తీర్మానాలు తయారు చేసి వాటిని అమలు చేయాలన్నారు. స్లీపింగ్ మిషన్ కొన్న సమయంలో అందుకు సంబంధించిన వారంటీని ఎందుకు చూసుకోలేదని వారంటీని పరిశీలించి ఆ కంపెనీకి సంబంధించిన వాటిపై చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. రోడ్ల వెడల్పులో 10 కోట్లకు పైగా పెండింగ్ పనులు ఉన్నాయని వాటి నిధులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని అందుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేవని పనులు ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. పనులు ఏర్పాటులో పార్టీలకతీతంగా అందరు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం మారిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, స్థానిక సంస్థల కలెక్టర్ గాంగ్వార్,  కమీషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.