షైన్ ఏ లైఫ్ ట్రస్టు ఫౌండర్ ఆద్వర్యంలో క్రికెట్ పోటీలు
- విజేత గా నిలిచిన తాడిపర్తి జట్టు
- 50 వేల నగదును అందజేసిన ట్రస్ట్ చైర్మన్ బాధగౌని మానస
ముద్ర,పానుగల్ :- షైన్ ఏ లైఫ్ ట్రస్టు ఫౌండర్ ఆద్వర్యంలో పానుగల్ మండలం చింతకుంట గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గ్రామ యువకుల సహకారంతో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో తాడిపర్తి జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన జట్టుకు 50 వేల నగదు రూపాయలను,జ్ఞాపికలను ట్రస్ట్ చైర్మన్ బాధగౌని మానస క్రీడాకారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని గ్రామీణ ప్రాంతాలలో యువత పట్టుదలతో చదవడంతో పాటు తమకు ఇష్టమైన క్రీడల పట్ల మక్కువను పెంపొందించుకొని అందులో రాణించేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు.
పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉంటుందని ఆమె గుర్తు చేశారు, ప్రతి ఒక్కరిలో సేవా దృక్పథం అనేది కలిగి ఉండాలని కోరారు, ఒక చింతకుంట గ్రామంలోనే కాకుండా ఈ ప్రాంతం తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో సైతం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఉదృతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని చైర్మన్ బాధగౌని మానస తెలిపారు చింతకుంట గ్రామంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు గ్రామ యువతకి ఆమె అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు బాధగౌని అనూష స్థానిక నాయకులు,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.