జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న సూర్యాపేట డిపిఆర్ఓ

  • చిన్న పత్రికలు పెద్ద పత్రికలు,చిన్న ఛానల్ లో పెద్ద ఛానల్ అంటూ వివక్ష
  • ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తున్న డిపిఆర్ఓ, ఇతర అధికారులను సస్పెండ్ చేయాలి
  • మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన అవిశ్వాస తీర్మానానికి విలేకరులను అనుమతించే విషయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు
  • ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటూ ఉన్నతాధికారులను సైతం  తప్పు దోవ పట్టించిన వైనం
  • అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సూర్యాపేట సమాచార శాఖను ప్రక్షాళన చేయాల్సిందే అంటున్న జర్నలిస్టులు
  • సోమవారం సమాచార శాఖ అధికారులపై గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు అనంతరం జరిగే ధర్నాకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు కదలి రావాలి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జర్నలిస్టులకు రాజ్యాంగం పరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ, నియంతలా వ్యవహరిస్తూ, ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న సూర్యాపేట డిపిఆర్ఓ ను, సమాచార శాఖ ఇతర అధికారులను కూడా సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో జరిగిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ అవిశ్వాసాల విషయంలో మున్సిపల్ కార్యాలయంలోకి జర్నలిస్టులను అనుమతించే విషయంలో సమాచార శాఖ అధికారులు వివక్షతను ప్రదర్శించారని నిరసిస్తూ యూనియన్లకు అతీతంగా శనివారం రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 32 మంది జర్నలిస్టులు సంతకాలు చేసిన వినతిపత్రం సమర్పించి, నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, పాల్వాయి జానయ్యలు మాట్లాడారు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలు, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అంటూ విలేకరుల మధ్య తగాదాలు సృష్టించడానికి డిపిఆర్ఓ కంకణ భద్దు డయ్యాడని, అర్హత లేనప్పటికీ డిప్యూటేషన్ పై ఇంకా ఎన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడుతూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ ఇక్కడ తిష్ట వేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటూ జిల్లా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించారని, విలేకరులను అనుమతించే విషయంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్, జీవోలు ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సమీకరించు, బోధించు, పోరాడు అని పిలుపునిచ్చిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల ప్రకారం ప్రతి మనిషి తోటి మనిషితో సమానత్వం కలిగి ఉండాలని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ కొందరి అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టులు వివక్షతకు గురి కావడం బాధాకరమన్నారు. సమాజంలోని అందరి హక్కులు, బాధ్యతల కోసం కొట్లాడే జర్నలిస్టులు తమ హక్కులు, బాధ్యతల కోసం కూడా ఆందోళనలు నిరసనలు ధర్నాలు చేయాల్సి రావడం  విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  సూర్యాపేట సమాచార శాఖ కార్యాలయంలో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాల విషయంలో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ లో ఫిర్యాదు అందించి అనంతరం జరిగే ధర్నాకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. తదుపరి రాష్ట్రవ్యాప్త కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, హైదరాబాదులో ప్రజా పాలన కార్యక్రమంలో ఫిర్యాదు తో పాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కి,సమాచార శాఖ అధికారులకు, జిల్లా  మంత్రులకు, స్థానిక శాసనసభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కి ఫిర్యాదులు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో విలేకరులు  కొండ్లే కృష్ణయ్య, ఉయ్యాల నరసయ్య, పుట్ట రాంబాబు, తండు నాగేందర్, రాచకొండ రామచంద్ర రాజు, ఎస్కే చాంద్ పాషా, సతీష్,దుర్గం బాలు, ప్రభు, కొరివి సతీష్,  తదితరులు పాల్గొన్నారు