తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ కు చిరునామాగా రూపుదిద్దుతాం

తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ కు చిరునామాగా రూపుదిద్దుతాం
  • రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ల ఏర్పాటు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సాంకేతికత పై 
  • జపాన్ కంపెనీ  యమానాషీ  సహకారంతో ముందడుగు.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, తెలంగాణ బ్యూరో :రానున్న కాలంలో థర్మల్  విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, తెలంగాణలో ఇప్పటినుండే పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లను, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన మంళవారం టోక్యో నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యమానాషీ  గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనను స్వయంగా పరిశీలించారు. జపాన్ దేశంలో మొట్టమొదటి పవర్ టు గ్యాస్ కంపెనీగా పేరోందిన యమానాషీ రిసెర్చ్ సెంటర్లో ఆయన సైంటిస్టులు, నిర్వహకులతో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉత్పత్తి ప్రక్రియను, ఇతర పునరుత్పాదక విద్యుత్  సాంకేతికతలను పరిశీలించి చర్చించారు.

ఈ సందర్భంగా అక్కడి అధికారులు సోలార్ విద్యుత్ ను వినియోగిస్తూ నీటిని ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ గా  విడగొట్టే యంత్ర విభాగాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్  సెల్స్ గా, ఫ్యాక్టరీలలో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేదిగా వినియోగిస్తున్నారని నిర్వాహక ఇంజినీర్ శ్రీ కునిగి  వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో థర్మల్ విద్యుత్తును కాకుండా సోలార్ విద్యుత్ ను వినియోగిస్తున్నామనీ అందుకే దీన్ని    గ్రీన్ హైడ్రోజన్ గా  పేర్కొంటునట్లు తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ  ఈ తరహా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేయటానికి ఇంధన శాఖ సన్నాహాలు ప్రారంభించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు విస్తారంగా ఉన్నందున  రాష్ట్రమంతట గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను  ఏర్పాటు  చేయవచ్చని, తద్వారా దేశంలో గ్రీన్ హైడ్రోజన్ కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. దీనిపై బృందంలో ఉన్న అధికారులతో మాట్లాడుతూ వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్ ను ఇక్కడ గల ఎరువుల కర్మాగారాలకు, ఆర్టీసీకి, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయవచ్చు అని తద్వారా పర్యావరణహిత చర్యలకు ఎంతో దోహదం చేసిన వారమవుతామని పేర్కొన్నారు.సోలార్ ప్లాంట్లలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బిఇఎస్ఎస్) యమానాషీ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందిస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  సిస్టం (బిఇఎస్ఎస్) బ్యాటరీల తయారీ విభాగాన్నీ భట్టి విక్రమార్క పరిశీలించారు. అయితే సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుండి పగటిపూట ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో మిగులు విద్యుత్ ను దాచడానికి ఈ బ్యాటరీలు ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి అవకాశం పూర్తిస్థాయిలో అందుబాటులో లేనందున, సోలార్ విద్యుత్ ను పూర్తిస్థాయిలో వినియోగించనప్పుడు మిగులు విద్యుత్ వృధా అవుతోంది. ఈ సందర్భంగా సింగరేణి  ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు, త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం సాంకేతికత వినియోగంపై ఉమ్మడి భాగస్వామ్యంతో ప్లాంట్ల ఏర్పాటు  కై కలిసి రావాలని జపాన్​ బృందాన్ని కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. భట్టి వెంట..ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.


జపాన్ తరహా హైదరాబాద్​ లో ట్రాఫిక్​ నియంత్రణ : 

మహానగర ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ దేశం ఆదర్శప్రాయమని ముఖ్యంగా టోక్యో నగరంలో షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మూడు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం టోక్యో నగరంలో హచుకో రైల్వే స్టేషన్ వద్ద గల షిబుయా క్రాసింగ్ ను సందర్శించారు. ఒకేసారిగా 3,000 మంది బాటసారులు ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాటును ఆయన పరిశీలించారు.రోజుకు కనీసం 5 లక్షల మంది పాదచారులు ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా ఈ రైల్వే మరియు రోడ్డు కూడలి నుండి దాటుతుంటారని, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రక్షణతో కూడిన పాదచారుల క్రాసింగ్  అని ఆయన ప్రసంశించారు. హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే  కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు జరపనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.షిబుయా  క్రాసింగ్ వద్ద భారత ఎంబసీ అధికారులు అక్కడ వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను భట్టికి వివరించారు.