నారీశక్తిగా ‘దిశ’

నారీశక్తిగా ‘దిశ’
Disha Disha Amrit to Naval Air Operations Officer Lt CDR

యేటా గణతంత్ర దిన వేడుకలలో భాగంగా కర్తవ్య పథ్​లో నిర్వహించనున్న నావికా దళ కవాతు బృందానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది దిశా అమ్రిత్. ఒకప్పుడు రక్షణరంగంలో విధులు నిర్వహించాలనుకున్న తండ్రి ఆశయాన్ని భుజాలకెత్తుకుని, పట్టుదలతో శ్రమించి ఆయన లక్ష్యాన్ని తను నెరవేర్చడమే కాకుండా... నేటి గణతంత్ర దినోత్సవాలలో భాగంగా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది దిశ. ‘కలలు కనండి.. ఆ కలలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయండి’ అని దిశా నిర్దేశం చేసిన అబ్దుల్​ కలాం మాటలను నిజం చేసింది, నేవీకి చెందిన మహిళా అధికారిణి దిశా అమ్రిత్​.  నేడు రాజ్​పథ్​లో జరిగే గణతంత్ర వేడుకలలో నౌకాదళ కవాతు బృందానికి మహిళా ఆఫీసర్​ దిశా అమ్రిత్​ నాయకత్వం వహిస్తోంది. 

మంగ‌ళూరుకు చెందిన దిశా అమృత్ 2016లో నేవీలో అడుగు పెట్టారు. రిపబ్లిక్ డే వేడుకలలో144 మంది యువ నావికుల బృందానికి  నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ సీడీఆర్ కి దిశ అమృత్ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో ముగ్గురు మహిళలు,  ఐదుగురు పురుషులు ‘అగ్నివీర్స్’గా శిక్షణ పొందుతున్నారు. ‘నారీశక్తి’ని ప్రధాన ఇతివృత్తంగా రిపబ్లిక్​ పరేడ్​లో ప్రదర్శన ఇవ్వనున్నారు. మంగుళూరులో పుట్టిన దిశ తల్లి లీల. బ్యాంకు మేనేజర్​గా రిటైరైంది. తండ్రి అమ్రిత్​ కుమార్​.. కర్ణాటకలోని బాలభవన్​ ఛైర్మన్​గా పనిచేశారు. ఆయనకు చిన్నప్పటి నుండీ నేవీలో పనిచేయాలని ఉండేది. కానీ అది నెరవేరలేదు. దాంతో దిశను ఆ దిశగా ప్రోత్సహించాడు. ఆమెను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. దిశ కెనరా స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది.  

చిన్నప్పటి నుండే ఆటలు, వ్యాపకాలు, చదువు.. ఇలా దేన్నైనా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు సాగేలా నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అలాగే చిన్నవయసు నుంచే దేశానికి సేవ చేయాలని, రక్షణ రంగంలోకి వెళితే జీవితం సార్థకమని చెబుతూ పెంచారు అమ్రిత్​. అలా దిశకు చిన్నప్పటి నుంచే రక్షణరంగపై మక్కువ పెరిగింది.  బెంగళూరులో బీఎం ఎస్​ ఇంజనీరింగ్​ కాలేజీలో కంప్యూటర్​ సైన్స్​ విభాగంలో ఇంజనీరింగ్​ పూర్తిచేసింది. తరువాత కొద్దిరోజులు అమెరికాకు చెందిన ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ ఆమె సంతృప్తి పడలేదు. చిన్నప్పటి నుండీ తన తండ్రి నేర్పించిన దేశ సేవ గురించే ఆలోచించేది. అలా తన తండ్రి ఆశయమైన నేవీలోకి రావాలనుకుంది. వెంటనే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి దేశసేవ చేయాలని నిర్ణయించుకుంది.  2016లో నావికా దళానికి ఎంపికైంది. ఏడాది  శిక్షణ అనంతరం 2017లో అండమాన్ నికోబార్ దీవుల్లోని కీల‌క నౌకాద‌ళ కేంద్రంలో నేవల్​ ఎయిర్​ ఆపరేషన్స్​ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తోంది. 

తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశంపై దిశ స్పందిస్తూ.. ‘మగవారితో మహిళలు కూడా సమానం అని నాలాంటి ఆఫీసర్స్​ నిరూపిస్తున్నారు.  రక్షణ రంగంలో సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ మహిళల్ని కూడా యుద్ధ కార్యకలాపాల్లోకి తీసుకుంటున్నారు. ఇంకా స్ర్తీ, పురుషుల్లో వ్యత్యాసం ఎక్కడుంది? ఎందుకుండాలి? అందుకే నన్ను ఎవరైనా “మహిళా అధికారి(ఉమన్​ ఆఫీసర్​)”అని  పిలిస్తే,  “ఆఫీసర్” అని  పిలవండి.. అదే నాకు ఇష్టం. ఎందుకంటే నేను నా తోటి పురుష సహచరులతో సమానమని నిరూపించుకున్నాను. 144 మందితో కూడిన నేవీ బృందానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం నాకు దక్కింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 2008లో ఎన్​సీసీ బృందంలో భాగంగా తొలిసారి రిపబ్లిక్​ డే పరేడ్​లో పాల్గొన్నాను. అప్పుడే ఎప్పటికైనా రక్షణ దళ బృందానికి నాయకత్వం వహించాలని నిర్ణయించుకున్నా.  నావికా పరేడ్ బృందానికి నాయకత్వం వహించడం నా జీవితంలో అందిన అద్భుతమైన అవకాశం... అప్పటి కల.. నేడు నెరవేరింది. ఇది మా నాన్న కల కూడా.. ముందు ముందు నా వృత్తిలో క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగుతా.. దేశానికి సేవ చేస్తా..’ అంటోంది దిశా అమ్రిత్​.