పెంట్లవెల్లి కేజీబీవీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం - జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారుల పర్యవేక్షణ పెంచాలి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థకు గురైన సంఘటనపై ఆరా తీయడానికి పెంట్లవెల్లి కేజీబీవీనీ కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పర్యవేక్షించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.విద్యా ర్థులు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు తెలు సుకుని రిపోర్టు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశాలు జారీ చేశారు.
ఘటనకు పూర్తిస్థాయి బాధ్యులైన కేజీబీవీ ప్రత్యేక అధికారిపై చర్యలు తీసుకోవాలని, కేజీబీవీలో పని చేస్తున్న వంట సిబ్బందిని సైతం మార్చాలని ఆదేశించారు. వంటగదిని పరిశీలించి కలెక్టర్ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
కేజీబీవీలో వినియోగించిన బియ్యం, కూరగాయలను మారుస్తూ కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థులకు అందుతున్న మిషన్ భగీరథ స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయంతో పాటు ప్రత్యేకంగా ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఘటనకు బాధ్యులైన సిబ్బంది ప్రత్యేక అధికారిపై చర్యలు చేపట్టాలని డీఈఓ ను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడ పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.
కేజీబీవీకి సరుకులు అందించే సరుకుల నాణ్యత లేకుంటే అట్టి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ కేజీబీవీ లోని ప్రతి రూమును కలియ తిరుగుతూ వంట సామాగ్రి నిత్యవసర సరుకులను పరిశీలించి పరిశీలించారు. 9వ, 10వ తరగతుల విద్యార్థుల తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించి బోధన, వసతులపై ఆరా తీశారు.
విద్యార్థులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి అక్కడే ఉన్న అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఏదైనా సమస్యలు ఉంటే తన నెంబర్కు మెసేజ్ రూపంలో అందజేయాలని విద్యార్థులకు కలెక్టర్ తన నెంబర్ను అందజేశారు.అంతకుముందు కలెక్టర్ కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకుని విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి భరోసా కల్పించారు.పరిస్థితిని పరిశీలించుటకై వారం రోజుల్లో తిరిగి సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట డిఇఓ గోవిందరాజులు, డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి, ఆర్డిఓ నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.