పంచాయతీల అభివృద్ధిలో అధికారులు కీలకపాత్ర పోషించాలి

పంచాయతీల అభివృద్ధిలో అధికారులు కీలకపాత్ర పోషించాలి
  • ప్రత్యేక అధికారులకు ఒరియంటేషన్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్  శశాంక

ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధిలో అధికారులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. మంగళవారం కొంగరకలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినందున ప్రభుత్వ ఆదేశాల ప్రత్యేక అధికారులకు గ్రామ పంచాయతీల భాద్యతలు అప్పగించినట్లు చెప్పారు. ప్రత్యేక అధికారులు 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

గ్రామ పంచాయతీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు గురించి, గ్రామంలోని ప్రత్యేక సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, కోర్టు కేసుల పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.  గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ద్వారా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మారుమూల గ్రామాలకు సైతం శుద్ధ తాగు నీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, వివిధ విభాగాల జిల్లా ఉన్నత అధికారులు, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.