పెరిగిన పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ శశాంక

పెరిగిన పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ శశాంక

రంగారెడ్డి, ముద్ర:వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో  పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జరుగనున్న పోలింగ్ సందర్భంగా పెంచిన సమయం అందుబాటులో ఉంటుందని సూచించారు. వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఈసారి మాత్రం ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని భారత ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచిందని కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ సమయం పెంపు వల్ల  ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరింత వెసులుబాటు లభించిందని అన్నారు. పెంచిన పోలింగ్ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని, ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.