పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 

పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ  సందర్బంగా ఎస్పీ  పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్,  ఎస్ హెచ్ వో,  రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్, 5 ఎస్  అమలు తీరును పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో  ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న  నేరస్తుల, రౌడీ షీటర్ల  వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో  సి.ఐ రవి , ఎస్.ఐ  రామకృష్ణా పాల్గొన్నారు