పేపర్ లీకేజీలో బండి హస్తం ఉందన్న దివాకర్ రావు

పేపర్ లీకేజీలో బండి హస్తం ఉందన్న దివాకర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : పదవ తరగతి ప్రశ్నా పత్రాల  కేజీలో  బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ హస్తముందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు.  బుధవారం అయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10వ తరగతి ప్రశ్నా పత్రం  లీకేజీ లో ప్రశాంత్ తో పాటు సంజయ్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. సంజయ్ ప్రమేయంతోనే పేపర్ లీకేజి జరిగిందని ఆయన అభియోగించారు.  సంజయ్ ని చట్టప్రకారం అరెస్టు చేస్తే బిజెపి శ్రేణులు ఆందోళన దిగడం విచారకరమని అన్నారు. బండి సంజయ్ ముఖ్యమంత్రిని, మంత్రులను తూలనాడడం అలవాటుగా మారిందని అన్నారు. సంజయ్ లాంటి వ్యక్తికి శిక్ష పడడం న్యాయమని అన్నారు. అంతేకాకుండా ఆయన ప్రజాప్రతినిధిగా అనర్హత వేటు వేస్తూ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర పెద్దల డైరెక్షన్లోనే సంజయ్ నడుచుకుంటూన్నాడని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు గిట్టని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చి వేయడం పనిగా పెట్టుకుందని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే రాబోయే ఎన్నికల్లో గద్దె దిగడం తథ్యమని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఠాన్నీ కదల్చలేరని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెట్ట రాజయ్య ,యువ నాయకుడు నడిపెల్లి విజిత్రావు బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.