తెలంగాణలో మూడుసార్లు దీపావళి...

తెలంగాణలో మూడుసార్లు దీపావళి...

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలే..
కుటుంబ పాలనలకు స్వస్తి పలుకుతాం..
9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి, అక్రమాలే 
అవినీతిపరులను జైలుకు పంపుతాం... 
మెట్‌పల్లి సభలో అమిత్ షా...

మెట్‌పల్లి ముద్ర: ఈసారి తెలంగాణలో మూడు సార్లు దీపావళి పండగ జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి దీపావళి పండుగను జరుపుకున్నామని, డిసెంబర్ 3వ తేదీన బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి దీపావళి, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి జరుపుకోబోతున్నామని అన్నారు.  సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల  నియోజకవర్గం లోని మెట్‌పల్లి లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, ఎంఐఎం కాంగ్రెస్ ఈ మూడు కుటుంబ పార్టీ లేనని, తరలు మారినా కుటుంబ పార్టీలుగానే ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ 2 జీ కేసీఆర్, కేటీఆర్ ఎంఐఎం 3జీ ఓవైసీ తాత,తండ్రి,ఓవైసీ ముగ్గురు, కాంగ్రెస్ 4జీ నెహ్రూ,రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ నాలుగు తరాలు ఇవి కుటుంబ పార్టీలు అయితే బీజేపీ మాత్రం ప్రజల పార్టీ అని అన్నారు. 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి అక్రమాలే అని ధ్వజమెత్తారు. 

అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులందరినీ జైలుకు పంపిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ, పాస్ పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చాడని ఆ హామీ నెరవేర్చకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క బిజెపి అబద్ధాలు చెప్పదని. పక్క బీసి వ్యక్తిని సీఎంని చేస్తామన్నారు. బిజెపి సిద్దిపేట జిల్లా బైరాన్పల్లిలో అమరవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేయడంతో పాటు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హిస్తామన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంతో పాటు నిజామాబాద్ లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పసుపు బోర్డు విషయంలో ధర్మపురి అరవింద్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాడని ఆయన ఒత్తిడి వల్లనే పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. పసుపులోని ఆయుర్వేద గుణాల పై అధ్యయనం చేసేందుకు 2 వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను మోసం చేశాయని, తెలంగాణలో తొలిసారి బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ చేయబోతున్నదన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని బీసీ, ఎస్సీ,ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పై ఉన్నదని బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలే పరిపాలన చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, ఆర్మూర్, బాల్కొండ అభ్యర్థులు బోగ శ్రావణి, ధర్మపురి అరవింద్, ఎస్. కుమార్ రాకేష్ రెడ్డి, అన్నపూర్ణ, జిల్లా అధ్యక్షుడు సత్యనారయణ, డాక్టర్ రఘు, ఆకుల లింగ రెడ్డి, జే ఎన్ సునీత వెంకట్, సురభి నవీన్, చెట్లపళ్లి సుఖేందర్ గౌడ్, బొడ్ల రమేష్, దొనికేల నవీన్ లు ఉన్నారు.