కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్న

కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్న
  • భూకబ్జాలు, లంచాలతో కోట్లు దండుకున్న గంగుల
  • ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దద్దమ్మ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నయీం బ్రదర్స్
  • కేటీఆర్ సీఎం అయితే హరీష్, కవిత, సంతోష్ ఔట్ కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కమలాకర్ నీలెక్క అవినీతి చేయడానికి నేనేమైనా అధికారంలో ఉన్నానా? నీ లెక్క భూకబ్జాలు చేసి ప్రజలను దోచుకున్నానా? 4 ఏళ్లు పోరాటాలు చేసిన. ప్రజల కోసం జైలుకు పోయిన. నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని ప్రజల కోసం పోరాడుతున్నా నువ్వా నా గురించి మాట్లాడేది? అంటూ కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వని గంగుల కమలాకర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారో నిలదీయండి అంటూ పిలుపునిచ్చారు. నేను పోరాడుతుంటే నాపై పదేపదే అవినీతి మరక వేస్తుూ బీఆర్ఎస్ నేతలు బూతులు తిడుతున్నారని చెప్పిన బండి సంజయ్ అసలు తాను చేసిన పాపమేంటని ప్రశ్నించారు.

పేదల కోసం పోరాడి జైలుకు పోవడమే తప్పా? కరీంనగర్ కు రూ.9 వేల కోట్లు తేవడమే తప్పా? అని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో ప్రచారం చేసిన బండి సంజయ్ గాంధీ విగ్రహం వద్దకు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది విశ్వకర్మ సంఘం నాయకులు బండి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

ఎంపీగా ఉంటూ 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన. స్మార్ట్ సిటీ, ఆర్వోబీ, రోడ్లకు నిధులు తెచ్చిన. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నేను అవినీతికి పాల్పడుతున్నానట అందుకే ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని చెప్పడానికి సిగ్గుండాలి అన్నారు. ప్రజా సమస్యలపై నేను పోరాడుతుంటే కేసీఆర్, గంగుల కమలాకర్ కలిసి నాపై దాడి చేసి జైలుకు పంపారు. నేను మీ కోసం కొట్లాడితే, పేదల కోసం సర్కార్ ను నిలదీస్తే కేసీఆర్ నాకిచ్చిన గిఫ్ట్ 74 కేసులని చెప్పారు. కరీంనగర్ ప్రజలను నేను కోరేదొక్కటే మీకోసం కొట్లాడేది ఎవరో మిమ్ముల్ని మోసం చేసి దోచుకునేదెవరో ఆలోచించి ఓటేయండి పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.