పతుల గెలుపు కోసం నడుము కట్టిన భార్యలు

పతుల గెలుపు కోసం నడుము కట్టిన భార్యలు
  • మేము సైతం అంటూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మహిళలు
  • కొత్తూరు, కేశంపేట మండలాల్లో ఇంటింటి ప్రచారం

ముద్ర/షాద్ నగర్:- పార్లమెంటు ఎన్నికల్లో పతుల గెలుపు కోసం భార్యలు నడుము కట్టి ముందుకు సాగారు. ఆదివారం కొత్తూరు మున్సిపాలిటీ తో పాటు కేశంపేట మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డి కి మద్దతుగా వారి సతీమణి అశ్లేష రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సతీమణి అనురాధ, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ లు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. చల్ల వంశీచంద్రెడ్డి గెలుపే లక్ష్యంగా భారీ లోకం ఒక్కసారిగా నడుము కట్టి ముందుకు సాగుతూ కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ మహిళా నాయకులు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మహిళలకు బొట్టు పెట్టి కరపత్రాలు అందిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సరదాగా దోషాలు బోండాలు వేస్తూ వృత్తి పని వారితో మాటలు కలిపారు. రోడ్లపైకి ఒక్కసారిగా నారీమణులు రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడి సందడిగా మారిపోయింది. షాద్ నగర్ నియోజకవర్గంలో అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచర వర్గం తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని ముందుకు సాగించారు. ఇంటింటికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల కరపత్రాలను పంచుతూ హస్తం గుర్తుకే ఓటు వేయాలంటూ ఓటర్ దేవుళ్లను అభ్యర్థించారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలను ప్రణాళిక బద్ధంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అశ్లేష రెడ్డి వివరించారు. వరుసగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే నాని, తోడు ముగిసిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పథకాలను అమలు చేయడం జరుగుతుందని వివరించారు. భారతీయ జనతా పార్టీ మతవిద్వేశం రెచ్చగొట్టి ప్రజలను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తుందని, ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని కోరారు. నారీమణులు మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రచార పర్వాన్ని అంబరాన్ని అంటే విధంగా ప్రజలను ఆకర్షిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, కేశంపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్, కౌన్సిలర్ విశాలతో పాటు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.