దళితబంధు’ పై  అనుమానాలు?

దళితబంధు’ పై  అనుమానాలు?
dalitha bandhu telangana scheme details apply online
  • రెండో విడతలో ఒక్కరికీ మంజూరుకాని వైనం
  • పూర్తి కావొస్తున్న ఆర్థిక సంవత్సరం

రాష్ట్రంలో దళిత బంధు ఇస్తారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద కనీసం ఒక్కరికీ స్కీమ్‍ మంజూరు కాకపోవడం గమనార్హం. ఏకంగా రూ.17,700 కోట్లు బడ్జెట్‍ పెట్టినా లాభం లేదు. ఇప్పటివరకు సెకండ్‍ ఫేజ్‍ లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కాలేదు. మరో రెండు నెలల్లో కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతున్నది. అయినప్పటికీ సర్కార్‍లో చలనం లేదు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మొదటి విడత దళిత బంధు పక్రియ పూర్తి కాలేదని అధికారులే చెబుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున బెనిఫిషియర్ల అనంతరం రెండో విడత స్టార్ట్ చేస్తామని ఆఫీసర్లు దాట వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తుండటంతో రెండో విడత కోసం కేటాయించిన బడ్జెట్‍ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? లేదా? అనే అనుమానం కూడా ఎస్సీ కార్పొరేషన్‍ అధికారుల్లో ఉంది.  దీంతో వివిధ జిల్లాల్లోని ఎమ్మెల్యేల గుండెల్లో దడ పుడుతోంది. నిజానికి ఈ స్కీమ్‍తో ప్రజలకు మేలు జరగడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు మంచి పేరు వస్తుంది.

కానీ స్కీమ్‍ పంపిణీ జాప్యంతో పాటు లబ్ధిదారుల ఎంపిక పక్రియలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న గిమ్మిక్కులతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.  రెండో విడత దళిత బంధు స్కీమ్‍లో ప్రతి నియోజకవర్గానికి 1500 మందికి ఇవ్వాలని సర్కార్‍ తొలుత ప్లాన్‍ చేసింది. కానీ నిధుల కొరతతో అసెంబ్లీ సెగ్మెంట్‍కు కేవలం 500 మందికి కుదించారు. ఆ తర్వాత 200 మంది అని ప్రకటించారు. ఇప్పుడు ఈ సంఖ్యను కూడా సెలెక్ట్ చేయకపోవడంతో దళిత వర్గాలు ఫైర్‍ అవుతున్నాయి. దళిత వర్గాల్లోని నిరుద్యోగులు, పేదలు దళిత బంధు స్కీమ్‍ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం వస్తే తమ కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధి జరగడమే కాకుండా, బతుకుపై భరోసా పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో దళిత వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

స్కీమ్‍ సెలక్షన్లు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా  కార్యాలయాల చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. కానీ స్పష్టమైన సమాధానం లభించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ స్కీమ్‍ కోసం ఇప్పటి వరకు ఆన్‍లైన్‍ వ్యవస్థ కూడా లేకపోవడంతో పథకం పొందాలనుకునే వారికి మరిన్ని చిక్కులు వచ్చాయి. హుజూరాబాద్‍ నియోజకవర్గంలో తొలిసారి దళిత బంధు స్కీమ్‍ను పరిచయం చేశారు. అక్కడ 18,211 మందికి పథకాన్ని అందజేశారు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో సీఎం హామీ మేరకు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున 75 కుటుంబాలకు ఇచ్చారు. ఇక పైలెట్‍ ప్రాజెక్ట్ కింద చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్‍ మండలాల్లో 8,390 కుటుంబాలకు ఇచ్చారు. ఓవరల్‍ గా 115 నియోజకవర్గాల్లో 11,835 కుటుంబాలకు పథకం వర్తింపజేశారు. ఆ తర్వాత నియోజకవర్గానికి 100 మంది ఎంపిక పక్రియలో జాప్యం మొదలైంది. లబ్ధిదారుల ఎంపిక దగ్గర్నుంచి పంపిణీ వరకు వివాదాల మధ్య స్కీమ్‍ కొనసాగుతోంది.