చిన్నన్నకు పెద్ద పదవి

చిన్నన్నకు పెద్ద పదవి
  • ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా నియామకం

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం శనివారం నియమించింది. అభిమానులందరూ చిన్నన్నకు పెద్ద పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి దశ నుండే యువజన కాంగ్రెస్ లో పనిచేసిన చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుండి 9సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన మొదటి సారి ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని వనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వనపర్తి నుండి పోటీ చేసిన మేఘారెడ్డిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్ట్రీ ఇస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన రాజ్యసభ సభ్యులుగా చిన్నారెడ్డిని నియమిస్తారని వనపర్తి లో ప్రచారం జరిగినప్పటికీ ఆ రెండు పదవులు చిన్నారెడ్డికి దక్కలేదు. దీంతో నిరాశ చెందిన చిన్నారెడ్డి అభిమానులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా రావడంతో వనపర్తికి మరింత ప్రాధాన్యత పెరిగిందని, అభివృద్ధిని చిన్నారెడ్డి పరుగులు పెట్టిస్తారని ఆయన అభిమానులుఅంటున్నారు.