రైతుల రుణమాఫీ చేసి మాట నిలుపుకున్న  ప్రభుత్వం ... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి  

రైతుల రుణమాఫీ చేసి మాట నిలుపుకున్న  ప్రభుత్వం ... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి  

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో లక్షలోపు 11 లక్షల మందికి 6 వేల కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని, జూలై చివరి వరకు రెండవ విడతలో ఆరు లక్షల మంది రైతులకు 6000 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.

అలాగే ఆగస్టు 15 లోపు మూడవ విడతలో 2 లక్షల లోపు రుణమున్న అందరి రైతులకు తమ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పెట్టుబడుల కోసం ధన వంతమైన దేశమైన అమెరికాకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 14న రాష్ట్రానికి రానున్నారని, 15వ తేదీన మూడో విడత రైతులకు రుణమాఫీ వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. అర్హులై ఉండి రాని రైతులు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్ డెస్క్ లో సంప్రదించాలని ఆయన సూచించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ యువకుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధిని చాటారని ఆయన అన్నారు. దీనిని స్వాగతిస్తున్నామని ఇది శుభ పరిణామం అని ఆయన తెలిపారు.

అలాగే నియోజకవర్గానికి 3500 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే నాలుగు వేలకు పెన్షన్ పెంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని,  ఆరోగ్యశ్రీ కార్డులు అదనంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్, రవి, యాది, బి కృష్ణ, కమర్, రాగి వేణు, చిన్న రాములు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.