వరదల వల్ల కేశవాపురం గ్రామానికి ఇతర గ్రామాలతో తెగిన సంబంధాలు
- తేలు కుట్టిన గ్రామస్తుడిని డోలీలో అధికష్టం మీద వరద నుండి ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
- దశాబ్దాల కాలంగా తమ పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని పాలకులు
- నేతలు మారిన తమ తలరాతలు మాత్రం మారలేదు అంటున్న గ్రామస్తులు
- ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్
- తుంగతుర్తి వెలుగుపల్లి రోడ్డుపై పెద్ద చెరువు వద్ద తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
- రావులపల్లి నుండి జాతీయ రహదారి 365 వరకు పాడైన రోడ్డు
తుంగతుర్తి ముద్ర :- తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి వరదల వల్ల ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి .దశాబ్దాల కాలంగా ఎన్నో ప్రభుత్వాలు ఎందరో ప్రజాప్రతినిధులు మారుతున్న మా గ్రామ ప్రజల దశ మాత్రం మారడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు .గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేశవాపురం బంధం జోరుగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన కుటుంబరావు అనే వ్యక్తికి తేలు కుట్టడంతో వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.
కొంతమంది గ్రామస్తులు ధైర్యం చేసి కర్రకు డోలి కట్టి డోలీలో తేలు కుట్టిన బాధితునీ కూర్చోబెట్టి నెమ్మదిగా వరదలోనే మోసుకుంటూ బయటికి రావడం ఎంతో ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకపక్క భారీ వరద మరోపక్క బాధితుడు తేలు కుట్టిన బాధతో బాధపడుతున్న తీరు గ్రామస్తులను తీవ్రంగా బాధించింది. తమ గ్రామానికి ప్రతిసారి వరదల సమయంలో ఇదే విధమైన కష్టాలు వస్తున్నా పట్టించుకునే నాధుడే లేడని ప్రజలు అంటున్నారు.
గడచిన ప్రభుత్వాలు అన్ని గ్రామానికి వరదలు వచ్చినప్పుడు తప్పకుండా బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పడం తిరిగి వరదలు పోగానే మరచి పోవడం ఆనవాయితీగా మారిందని ప్రజలు అంటున్నారు .ఇప్పటికైనా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి గ్రామస్తుల ఇబ్బందులు పోగొట్టాలని తమ గ్రామాన్ని వరదల బారిన పడకుండా ఆదుకోవాలని యావత్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా తుంగతుర్తి మండల కేంద్రానికి వెలుగుపల్లి రోడ్డు గుండా రావడానికి ఉన్న రోడ్డులో పెద్ద చెరువు వద్ద బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో రైతుల వ్యవసాయ ట్రాక్టర్లు ,ఆర్టీసీ బస్సులు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్యామ్ సైతం దశాబ్దాల కాలంగా వరదల ఫాలవుతూనే ఉంది.
ఇప్పటివరకు ఈ డ్యామ్ నిర్మాణానికి పూనుకున్నవారు లేరని ప్రజలు అంటున్నారు. గడచిన బిఆర్ఎస్ పాలకుల హయాంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మందుల సామేల్ గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే రోడ్డుకు మరో మారు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రావులపల్లి నుండి తుంగతుర్తి మీదుగా జాతీయ రహదారి వరకు రోడ్డు పూర్తిగా శిథిలమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు .ఇకనైనా అధికారులు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.