‘ముందస్తు’ భయం

‘ముందస్తు’ భయం
Early election fear in Telangana
  • అన్ని పార్టీలలోనూ ఆందోళన
  • విజయావకాశాలపై సందేహాలు
  • కలవరపెడుతున్న వివిధ సర్వేలు
  • పెరిగిన ఓటు ఖర్చుతో గుండె గుబులు
  •  ప్రజా వ్యతిరేకత అధిగమించేదెలా?
  • అధికార పార్టీని వెంటాడుతున్న గుబులు
  • బీజేపీ నేతలలో విభేదాల కుంపటి
  • కాంగ్రెస్ లోనూ కొలిక్కి రాని వివాదాలు

ముందస్తు ఎన్నికల మీద దాదాపు అన్ని పార్టీలలోనూ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత వేస్తున్న కీలక అడుగులు ఈ చర్చకు కారణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయనే దాని మీద అందరిలోనూ లోలోపల భయం వెంటాడుతున్నది. అనేక అవాంతరాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. అయినా, అన్ని పార్టీల అధినేతలు ‘ముందస్తు’కు రెడీ అంటూ సవాలు విసరుతున్నారు. తమ తమ కార్యకర్తలను, నాయకులను మానసికంగా అందుకు సిద్ధం చేస్తున్నారు. ఒక రకంగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో  మరోసారి ముందస్తు ఎన్నికల చర్చ ఊపందుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ చెబుతున్నా ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కూడా ఇదే సమయంలో వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో లాగానే విపక్షాలను గందరగోళంలో పడేసేలా కేసీఆర్ ప్లాన్​ అమలు చేస్తున్నారనే ఊహాగానాలూ విన్పిస్తున్నాయి. కేసీఆర్​ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ప్రతిపక్షాలు గతంతో పోలిస్తే బలపడ్డాయి. ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత పెరిగినట్లు ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు పడిన ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్​ రెండు బీఆర్ఎస్​తో పోటీ పడనున్నాయి. కాంగ్రెస్​ నేతలు చాలా మంది ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కొంతమంది గులాబీ నేతలు కూడా చేరినా, ఇతర ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్‌‌ఎస్‌‌ను ఓడించేందుకు బలమైన ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకుంటే కేసీఆర్‌‌ కు ఇబ్బందే. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కు మొదటి శత్రువు కేసీఆర్. 

బీఆర్ఎస్ లో భయం

బీఆర్​ఎస్​ నేతలలో ఇప్పుడు ఎన్నికలంటేనే భయం పట్టుకుంటున్నది. మంత్రులు సహా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది. గతంలో లాగా కేసీఆర్​బొమ్మతో గెలుస్తామని ఉన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీపరంగా చేసే సర్వేలే కాకుండా ఎవరికి వారే సొంత సర్వేలకు దిగారు. సర్వేలలో కూడా వ్యతిరేకత స్పష్టమవుతోంది. ఇదే సమయంలో హుజూరాబాద్​ ఎన్నికల ఫుణ్యమాని ఓటు రేటు భారీగా పెరిగింది. ధరలకు అనుగుణంగా ఒక్కో ఓటు విలువ పది వేలు పలుకుతోంది. దీంతో ఈసారి ఎన్నికలు భారీ ఖర్చును కండ్ల ముందుంచుతున్నాయి. ఇప్పుడే ముందస్తుకు వెళ్తే, వెంటనే ఎన్నికలు ప్రకటిస్తారా? లేకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనే భయం పట్టుకుంది. దీనికి తోడుగా బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కేసీఆర్​ కుటుంబంలో రాజకీయ పోరు నడుస్తున్నదనే ప్రచారం విస్తృతమైంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో ప్రజలు ఎలా రిసీవ్​ చేసుకుంటారనే అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకైతే బీఆర్​ఎస్​ ను క్షేత్రస్థాయిలో అంతగా స్వీకరించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాలకు వెళ్తుంటే నిలదీతలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితులు అధికార పార్టీని ఆయోమయంలో పడేస్తున్నాయి. అయినా ఆ పార్టీ నాయకులు కేటీఆర్ సహా ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 

బీజేపీ లో విభేదాల కుంపటి

బీజేపీలో బయటకు కనిపించని విభేదాల కుంపటి రాజుకుంటున్నది. రాష్ట్రంలో బలపడ్డామని, బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతర్గత విభేదాలు ఆయోమయంలో  పడవేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నా ఓట్ల వేటలో కలిసి రావడం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. బండి సంజయ్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  ఎంపీ అర్వింద్​, ఈటల రాజేందర్, వివేక్, డీకే అరుణ, జితేందర్​ రెడ్డి మధ్య ఏదో ఒక రూపంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికితోడు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక కూడా కష్టంగానే మారింది. ఇలాంటి పరిస్థితులలో ముందస్తుకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆందోళన పార్టీ నేతలలో నెలకొన్నది. అయినా సరే సంజయ్ సహా నేతలంతా ముందస్తుకు సై అంటున్నారు.  

బలం ఉన్నా బలహీనతలే ముందు

క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు, నాయకుల బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి నానాటిటికి తీసికట్టుగా మారుతోంది. బీఆర్ఎస్​ కు దీటుగా ప్రతి సెగ్మెంట్ లో పార్టీ బలంగానే ఉంది. గట్టి పోటీ ఇచ్చే లీడర్లు కూడా ఉన్నారు. కానీ, ఎన్నికల సమయంలో పార్టీ కోసం ముందు నుంచీ పని చేస్తున్న వారిని కాదని ఫ్లైట్ మోడ్ లో దిగే వారికి టికెట్లు వస్తున్నాయి. దీంతో పార్టీ కేడర్​ చెల్లాచెదురవుతోంది. ప్రస్తుతానికి పార్టీలోని సీనియర్లు ఐక్యతారాగం అందుకున్నారు. రేవంత్​ రెడ్డి పాదయాత్ర తర్వాత ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది అనుమానంగా మారింది. అన్ని చోట్లా పార్టీకి బలమైన కేడర్​, లీడర్​ ఉన్నా ఎన్నికల ఖర్చుపై భయం వెంటాడుతున్నది. ఇప్పటి వరకైతే పార్టీపరంగా సెగ్మెంట్లకు రూపాయి ఇవ్వడం లేదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు, భారీ సభలకు జనాన్ని తరలించేందుకు సెగ్మెంట్ల ఇన్ చార్జీలే ఎంతో కొంత భరిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ లకు దీటుగా కాకుండా.. కనీసం పది శాతం కూడా ఖర్చు పెట్టలేదని, అందుకే డిపాజిట్​ రాలేదని ఆ పార్టీ ఎన్నికల కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు కీలకమైన సమయంలో ముందస్తుకు వెళ్తే ఖర్చు ఎలా అనేది పార్టీ నేతలను వేధిస్తున్నది. అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ముందస్తుకు రెడీ అంటుండడంతో తాము కూడా తయారే అని కాంగ్రెస్ నేతలు సవాలు విసురుతున్నారు. 

ఒకరిని చూసి ఒకరు యాక్టివ్​
విపక్షాలను తికమక చేయడం కోసమే కేసీఆర్​ ముందస్తు లేదని చెబుతున్నారనే చర్చ జరుగుతున్నది. గత యేడాది డిసెంబర్​ నుంచే బీఆర్​ఎస్​ గ్రామాలకు వెళ్తోంది. పల్లెల్లో ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తోంది. ప్రారంభోత్సవాలు షురూ చేస్తోంది. నేతలు తాయిలాలు ప్రకటిస్తున్నారు. నాలుగేండ్ల నుంచి రూపాయి ఇవ్వని విభాగాలకు ఇప్పుడు వందల కోట్లు విడుదల చేస్తున్నారు. ఉద్యోగ వర్గాలను దగ్గరకు తీస్తున్నారు. దీంతో ముందస్తు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ కూడా బీఆర్​ఎస్ ను అనుసరిస్తున్నాయి. పాదయాత్రలు, రాజకీయ సభలకు శ్రీకారం చుడుతున్నారు.