ఆర్ధిక సంక్షోభంలో దాయాది దేశం

ఆర్ధిక సంక్షోభంలో దాయాది దేశం
Economic crisis of Pakistan

భారత ఉపఖండంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మరువక ముందే మరొక దేశం పాకిస్తాన్‍ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. రోజురోజుకీ అడుగంటిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, వేగంగా పతనమవుతున్న పాకిస్తాన్‍ రూపాయి విలువ, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెద్ద ఎత్తున పెరిగిన విదేశీ రుణ భారం కారణంగా... పాకిస్తాన్‍ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోంది. గత ఏడాది 16.6 బిలియన్‍ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిలువలు ప్రస్తుతం 5.6 బిలియన్‍ డాలర్లకు చేరుకొని మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థాయికి విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోయాయి. దీంతో గ్యాస్‍, పెట్రోలియం ఇంధనం వంట నూనెలులాంటి వస్తువులను దిగుమతి చేసుకోటానికి పాకిస్తాన్‍ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం 42 శాతానికి చేరుకోవటంతో వంట నూనెలు, గోధుమపిండి, నెయ్యి లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి వంట నూనెలను అత్యవసర వస్తువుల జాబితా నుండి తొలగించారు. 15 కిలోల గోధుమపిండి బ్యాగ్‍ ధర రూ. 2050లకు చేరుకుంది. అలాగే కిలో ఉల్లిపాయల ధర 2022 రూపాయలకు చేరుకుంది.

ప్రభుత్వం వివిధ వస్తువుల పైన ఇచ్చే సబ్సిడీలు తొలగించడం వలన వినియోగ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సబ్సిడీ పైన ప్రభుత్వం ఇచ్చే గోధుమపిండి కోసం ప్రజలు పడిగాపులు కాయడమే కాదు మరికొన్ని చోట్ల తొక్కిసలాటలు కూడా జరుగుతున్న ఉదంతాలు కనపడుతున్నాయి. పాకిస్తాన్‍లో ఒకవైపు ఆర్థిక సంక్షోభం  మరొకవైపు ఆహార సంక్షోభం భవిష్యత్తులో తలెత్తే అవకాశం కనబడుతోంది. రష్యా నుండి నాలుగు లక్షల 50 వేల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం వలన ఆహార సంక్షోభాన్ని అధిగమిస్తామని పాకిస్తాన్‍ భావిస్తోంది. కానీ రాబోయే రంజాన్‍ మాసం నాటికి ఆహార కొరత పాకిస్తాన్‍లో మరింత తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

డాలర్‍తో పాకిస్తాన్‍ రూపాయి మారకం విలువ రూ. 227లుగా రూపాయి పడిపోవడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఇంధనం, పెట్రోలు, గ్యాస్‍ లాంటి కీలకమైన వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి పోవటంవలన పాకిస్తాన్‍ ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలకు ఉపక్రమించింది. దీంట్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర గంటలకే మార్కెట్ల మూసివేత, పది గంటలకే రెస్టారెంట్లు, ఫంక్షన్‍ హాళ్ల మూసివేత లాంటి చర్యలు చేపట్టిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2021 నాటికి పాకిస్తాన్‍ అప్పులు 29 లక్షల 51 వేల కోట్ల రూపాయలకి చేరుకోవటంతో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుండి, మిత్ర దేశాల నుండి కొత్త అప్పులు పుట్టని స్థితిలోకి పాకిస్తాన్‍ దిగజారిపోయింది.